చెవర్లే సెయిల్ సెడాన్, ఎంజాయ్ ఎమ్‌పివి విడుదల జాప్యం
జనరల్ మోటార్స్ నుంచి కార్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెయిల్ ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన సంగతి తెలిసిందే. కాగా.. ఇదే ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో ఓ సెడాన్‌ను వెర్షన్‌ను కూడా మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న చెవర్లే ఏవియో యూ-వీఏ హ్యాచ్‌బ్యాక్ స్థానాన్ని భర్తీ చేస్తూ కంపెనీ కొత్త సెయిల్‌ను విపణిలో విడుదల చేసింది. అదే విధంగా.. భవిష్యత్తులో ఏవియో సెడాన్‌ను కూడా రీప్లేస్ చేస్తూ సెయిల్ సెడాన్‌ను జనరల్ మోటార్స్ ప్రవేశపెట్టనుంది.

సెయిల్ సెడాన్ విడుదలైన కొద్ది రోజుల తర్వాత చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి కూడా దేశీయ విపణిలో లభ్యం కావచ్చని తెలుస్తోంది. చెవర్లే సెయిల్ ఎమ్‌పివిని తొలిసారిగా ఈ ఏడాది జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో జనరల్ మోటార్స్ ఆవిష్కరించింది. ఏదేమైనప్పటికీ, ఈ రెండు కార్లు కూడా ఈ ఏడాది మార్కెట్లో విడుదలయ్యే ఆస్కారం కనిపించడం లేదు. జనరల్ మోటార్స్ తెలిపిన దాని ప్రకారం, కొన్ని అనివార్య కారణాల వలన ఈ రెండు మోడళ్ల విడుదలలో కాస్తంత జాప్యం జరగవచ్చని పేర్కొంది.
దీనిని బట్టి చూస్తుంటే, చెవర్లే సెయిల్ సెడాన్ మరియు చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివిలు వచ్చే ఏడాది ఆరంభంలో మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. ఇవేకాకుండా.. రానున్న నాలుగైదేళ్లలో అదనంగా 4-5 కార్లను విడుదల చేస్తామని జనరల్ మోటార్స్ పేర్కొంది.


Click it and Unblock the Notifications








