వేలానికి కామెరూన్ డియాజ్ డ్రైవ్ చేసిన పురాతన ఫెరారీ కారు
ఛార్లెస్ ఏంజిల్స్ సినిమాలో గ్లామరస్ రోల్ చేసిన హాలీవుడ్ అందాల భామ 'కామెరూన్ డియాజ్' మర్చిపోని వారెవ్వరూ ఉండరు. మత్తెక్కించే అందాలతో, అబ్బురపరచే విన్యాసాలతో అశేష ప్రేక్షక లోకానికి వినోదాన్ని పంచిన ఈ భామ ఉపయోగించిన వస్తువు ఒకటి ప్రస్తుతం వేలానికి వచ్చింది. 2003లో వచ్చిన ఛార్లెస్ ఏంజిల్స్ చిత్రంలో డియాజ్ డ్రైవ్ చేసిన పురాతన ఫెరారీ ప్రస్తుతం వేలానికి వచ్చింది. వేలంలో దీని వెల 50 లక్షల డాలర్లు పలకవచ్చని అంచనా.
ఇదే గనుక జరిగితే, ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఈ కారు కూడా చేరిపోనుంది. 1963కు చెందిన "ఫెరారీ 250 జిటి ఎస్‌డబ్ల్యూడి కాలిఫోర్నియా స్పైడర్" అనే ఈ సూపర్‌కారుకు చాలా గొప్ప చరిత్రే ఉంది. ఇంజనీరింగ్ చరిత్రలో అత్యంత ఉత్తమమైన వాటిలో ఇది కూడా ఒకటి. ఫెరారీ కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్జో ఫెరారీ ఆధ్వర్యంలో పినిన్‌ఫరీనా అనే డిజైన్ సంస్థ ఈ కారుకు రూపకల్పన చేయగా స్కాగ్లీట్టి దీనికి ప్రాణం పోశారు. ఇప్పటికీ ఇది చెక్కు చెదరని లుక్, వెనుదిరగని పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంది కాబట్టే ఇది అంత అధిక వెలను కలిగి ఉంది.

ఈ కారుకు వెచ్చించే సొమ్ముతో బ్రిటన్‌లోని అత్యంత విలాసవంతమైన స్థలం కెంట్‌లో 8 బెడ్‌రూమ్‌లు కలిగిన ఓ విలాసవంతమైన ఇంటిని సొంతం చేసుకోవచ్చు లేదా 28 ఫెరారీ 458 ఇటాలియా కార్లను లేదా ఓ సెకండ్ హ్యాండ్ లియర్‌జెట్ (అత్యంత విలాసవంతమైన విమానం) విమానాన్ని కొనుగోలు చేయవచ్చు. అప్పట్లో ఈ మోడల్ కార్లను కేవలం 55 మాత్రమే తయారు చేయటం జరిగింది. అందులో ఇప్పుడు వేలానికి వచ్చిన కారు 53వది కావటం విశేషం. ఈ కారు అనేక సినిమాల్లో దర్శనమిచ్చింది.
ఈ కారును తొలిసారిగా 1963లో తయారు చేసినప్పుడు ఇది గ్రే కలర్‌లో ఉండేది. అనంతరం దీనికి వేరొక పెయింట్‌ను వేయటం, ప్రస్తుతం ఒరిజినల్ కలర్‌తో రీప్లేస్ చేయటం జరిగింది. ఇక దీని ఇంజన్ విషయానికి వస్తే ఇందులో ఉపయోగించిన 3-లీటర్ వి12 ఇంజన్ గరిష్టంగా 280 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. వచ్చే సంవత్సరంతో ఈ కారు 50 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఫెరారీ నిర్మించిన అత్యంత అందమైన కార్లలో ఫెరారీ 250 జిటి ఎస్‌డబ్ల్యూడి కాలిఫోర్నియా స్పైడర్ ఒకటిగా చెప్పుకుంటారు.
ఫోర్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో తయారైన ఈ కారు కేవలం 8 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది, ఇది గరిష్టంగా 149 మైళ్ల వేగంతో పరుగులు పెడుతుంది. మూడేళ్ల క్రితమే ఈ కారులోని వివిధ భాగాలను పునరుద్ధరించి, పూర్తి కండిషన్‌లో ఉండేలా చేయటం జరిగింది. బ్రిటన్‌లోని ఆస్కాట్‌కు చెందిన టాలాక్రెస్ట్ అనే ఆక్షన్ కంపెనీ ఈ కారుకు వేలం నిర్వహించనుంది.


Click it and Unblock the Notifications








