డస్టర్, ఎక్స్‌యూవీ500, ఎర్టిగాల డిమాండే డింమాండు..
యుటిలిటీ వాహన సెగ్మెంట్లో తాజాగా ఎంట్రీ ఇచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ500, మారుతి సుజుకి ఎర్టిగా, రెనో డస్టర్ వాహనాలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ మోడళ్లకు కంపెనీలు సైతం ఊహించని రీతిలో బుకింగ్‌లు వచ్చి చేరుతున్నాయి. దీంతో వీటి వెయిటింగ్ పీరియడ్ కూడా పెరిగిపోతుంది. సరసమైన ధరలు, విశిష్టమైన ఫీచర్లతో లభిస్తున్న ఈ వాహనాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు బారులు తీరుతున్నారు.
కాస్తంత ఆలస్యమైనా ఫర్వాలేదు, తమ మనసుకు నచ్చిన, మెచ్చిన వాహనాన్ని సొంతం చేసుకోవాలని కస్టమర్లు ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే సమయంలో, ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ వద్దకు వచ్చే కస్టమర్లను చేజార్చుకోవటం ఇష్టం లేక, ఈ మోడళ్ల ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నాయి. డ్రైవ్ స్పార్క్‌కు అందిన సమాచారం ప్రకారం, ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా తమ డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తిని త్వరలోనే రెట్టింపు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
అలాగే, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా తమ గ్లోబల్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500 ఉత్పత్తిని పెంచిన సంగతి తెలిసిందే. అయితే, డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేకపోవటంతో రానున్న రోజుల్లో ఈ మోడల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో 25 మేర పెంచాలని కంపెనీ యోచిస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ500 మార్కెట్లోకి ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే 3 నెలల ఉత్పత్తి సామర్థ్యానికి సరిపడా బుకింగ్‌లు వచ్చిపడిన సంగతి తెలిసిందే.
కాగా.. దేశపు అగ్రగామి కార్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన బహుళ ప్రయోజన వాహనం ఎర్టిగాకు కూడా మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఇంచు మించు టొయోటా ఇన్నోవాకు పోటీగా వచ్చిన ఎర్టిగా మంచి స్పేస్, మెరుగైన మైలేజ్‌ను ఆఫర్ చేస్తూ ఆకర్షనీయమైన ధరకే లభిస్తోంది. ఈ మోడల్‌కు డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో, ఇప్పటికే ఎర్టిగా ఉత్పత్తిని రెట్టింపు చేసిన మారుతి సుజుకి, మరోసారి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. మొత్తమ్మీద చూసుకుంటే, భారతీయ కొనుగోలుదారులు యుటిలిటీ వాహనాలకు ఎంత మేరకు ప్రధాన్యత ఇస్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది. మీరేమంటారు?


Click it and Unblock the Notifications









