కొత్త గ్రాండే పుంటో స్పోర్ట్స్‌ను విడుదల చేయనున్న ఫియట్
ఇటలీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫియట్ ఇండియా, దేశీయ విపణిలో అందిస్తున్న హ్యాచ్‌బ్యాక్ గ్రాండే పుంటోలో మరో సరికొత్త మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. పుంటో హ్యాచ్‌బ్యాక్ విశాలమైన ఇంటీరియర్స్, గొప్ప డ్రైవింగ్ అనుభూతి, సరసమైన ధర, ఇటాలియన్ డిజైన్ వంటి విశిష్టతలను కలిగి ఉన్నప్పటికీ.. డీలర్‌షిప్ నెట్‌వర్క్, సర్వీస్ సెంటర్ల కొరత కారణంగా ఈ మోడల్ మార్కెట్లో పెద్దగా ఆదరణ పొందలేకపోతుంది.
ఈ నేపథ్యంలో, ఫియట్ తమ మార్కెటింగ్ నెట్‌వర్క్‌ను పెంచుకోవటమే కాకుండా ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను కూడా విస్తరించుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే, రేపు (మే 18, 2012) ఓ సరికొత్త శక్తివంతమైన ఫియట్ పుంటో 90 హెచ్‌పి స్పోర్ట్స్‌ను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేయనుంది. 'గ్రాండే పుంటో స్పోర్ట్స్' గా పిలువబడే ఈ హ్యాచ్‌బ్యాక్‌లో 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌ను అమర్చారు.
ఈ ఇంజన్ 90 హెచ్‌పిల శక్తిని, 209 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ సెగ్మెంట్లోనే అత్యంత శక్తివంతమైన డీజిల్ హ్యాచ్‌బ్యాక్ పుంటో స్పోర్ట్స్ నిలువనుంది. ఈ స్పోర్ట్స్ వెర్షన్ పుంటోపై రేస్ కార్లను తలపించే స్టిక్కరింగ్ (బాడీ డెకాల్స్), బ్లాకెన్డ్ రూఫ్, రీస్టయిల్ చేయబడిన అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇంటీరియర్‌లో కొద్దిపాటి స్టయిలిష్ మార్పులు ఉండే అవకాశం ఉంది.
పూనేలోని కొరెగావ్ పార్క్ వద్ద ఫియట్ కెఫేను మే 18, 2012న ప్రారంభించనున్న సందర్భంగా, ఈ కొత్త గ్రాండే పుంటో స్పోర్ట్స్‌ను కూడా అదే రోజున విడుదల చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఫియట్ గ్రాండే పుంటో స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ ధర ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫియట్ గ్రాండే ధర కన్నా రూ.30,000-40,000 అధికంగా ఉండొచ్చని అంచనా. కొత్త పుంటో గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








