జనరల్ మోటార్స్ నుంచి అప్‌గ్రేడెడ్ వెర్షన్ చెవర్లే బీట్
చెవర్లే బ్రాండ్‌లో జనరల్ మోటార్స్ అందిస్తున్న బుజ్జి కారు చెవర్లే బీట్ త్వరలోనే మరిన్ని హంగులతో సరికొత్త రూపంలో మన ముందుకు రాబోతుంది. పెట్రోల్, డీజిఎల్ ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉండి అందమైన లుక్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటున్న చెవర్లే బీట్ జనరల్ మోటార్స్‌కు బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. గ్లోబల్ మార్కెట్లో ఇది 'స్పార్క్' అనే పేరుతో అమ్ముడవుతోంది.
మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగానే జనరల్ మోటార్స్ కూడా తమ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే, చెవర్లే బీట్‌లో సరికొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ 2013 వెర్షన్ చెవర్లే బీట్‌లో సరికొత్త ఫ్రంట్ డిజైన్, కొత్త హెడ్‌ల్యాంప్స్, కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, కారు వెనుకవైపు రియర్ స్పాయిలర్‌కు సమీపంలో మధ్యభాగంలో అమర్చిన సెంటర్ స్టాప్ ల్యాంప్ వంటి మార్పులను గమనించవచ్చు.
కొత్త చెవర్లే బీట్ ఇంటీరియర్స్‌లో కూడా అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా ఇంటీరియర్ మెటీరియల్స్ క్వాలిటీ, మెరుగైన స్టోరేజ్ స్పేస్, సరికొత్త సెంటర్ కన్సోల్ డిజైన్ వంటి మార్పులు ఉండనున్నాయి. అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండే సూచనలు కనిపించడం లేదు. 2012 వెర్షన్ చెవర్లే బీట్ 1 లీటర్ డీజిల్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్లతో లభ్యం కానుంది.
జనరల్ మోటార్స్ తమ కొత్త 2013 చెవర్లే బీట్‌ను త్వరలో జరగనున్న ప్యారిస్ మోటార్ షోలో ఆవిష్కరించనుంది. ప్యారిస్ మోటార్ షో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 14 వరకూ జరగనుంది. మరి కంపెనీ ఈ కొత్త బీట్‌ను ఇండియన్ మార్కెట్‌కు తీసుకువస్తుందా..?


Click it and Unblock the Notifications









