లీమోజైన్ వెర్షన్ డస్టర్‌ను తయారు చేసిన విద్యార్థులు
ఈ ఫోటోలో కనిపిస్తున్న పొడవాటి కారును గమనించండి. ఇది ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా తాజాగా మన మార్కెట్లో విడుదల చేసిన డస్టర్‌లా కనిపించడం లేదు. డస్టర్‌లా ఏంటి ఇది నిజంగానే డస్టర్. అవును డాసియా డస్టర్ లీమోజైన్ వెర్షన్. డస్టర్ ఎస్‌యూవీని రెనో యూరప్ మార్కెట్లలో డాసియా బ్రాండ్ క్రింద విక్రయిస్తోంది.
కాగా.. ఈ లీమోజైన్ వెర్షన్ డస్టర్‌ను యూరప్‌కు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థుల బృందం తయారు చేసింది. 23 మంది సభ్యులతో కూడున్న ఓ విద్యార్థుల బృందం తమ ఈపిఏ (ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఆటో)లో భాగంగా ఈ లీమోజైన్ వెర్షన్‌ను తయారు చేసారు. సాధారణ డస్టర్ ఎస్‌యూవీని సరిగ్గా బి పిల్లర్ వద్ద కట్ చేసి దీనికి అదనంగా 59 ఇంచ్‌ల పొడవాటి షీట్‌ను జోడించారు. ఈ పొడగింపు కారణంగా డస్టర్ లీమోజైన్ వీల్‌బేస్ 5.83 మీటర్లకు పెరిగింది.
దాదాపు 1.6 టన్నుల బరువు ఉండే ఈ లీమోజైన్ డస్టర్‌లో ఇంజన్‌ను, చక్రాలను మాత్రం మార్చలేదు. ఇందులో 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్, 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను యధావిధిగా ఉంచారు. ఇక ఇంటీరియర్‌ను మాత్రం పూర్తి విలాసవంతంగా తీర్చిదిద్దారు. ఇందులో నాలు విశాలమైన కెప్టెన్ సీట్లు, ఓ పెద్ద ఎల్‌సిడి టివి, ఆండ్రాయిడ్ టాబ్లెట్, ఫ్రిడ్జ్, సన్‌రూఫ్, కంఫర్టబల్ ఇంటీరియర్ స్పేస్ వంటి అనేక విశిష్టమైన ఫీచర్లతో ఈ లీమోజైన్ వెర్షన్ డస్టర్‌ను విద్యార్థులు తయారు చేశారు.
బయటి వైపు నలుపు రంగు మ్యాట్ ఫినిష్ పెయింట్ జాబ్, స్టయిలిష్ అల్యూమినియం ప్లేట్ వంటి మార్పులు గమనించవచ్చు. యూరప్ మార్కెట్లలో లీమోజైన్ వెర్షన్ కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. కార్ కంపెనీలు కొందరు ప్రముఖలు, ధనవంతుల కోసం ప్రత్యేకించి ఇలాంటి కార్లను తయారు చేస్తుంటాయి. ఎగ్జిక్యూటివ్ డ్రైవ్ కావాలనుకునే వారికి, వివాహాలు వంటి శుభకార్యాలకు ఈ లీమోజైన్ వెర్షన్ కార్లను ఉపయోగించడం జరుగుతుంది.


Click it and Unblock the Notifications








