పవర్‌ఫుల్ బెంజ్ ఎస్‌యూవీ కొనుగోలు చేసిన కిమ్ కర్దాషియన్
హాలీవుడ్ తార కిమ్ కర్దాషియన్ గురించి మనం ఇటీవలే ఓ కథనంలో తెలుసుకున్నాం. అమెరికన్ రియాల్టీ టివి స్టార్ అయిన కిమ్ ఇటీవలే తన కొత్త బాయ్‌ఫ్రెండ్ కేన్ వెస్ట్ కోసం ఓ లాంబోర్గినీ సూపర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే, ఇప్పుడు ఆమె తాజాగా ఓ మెర్సిడెస్ బెంజ్ మిలటరీ ఎస్‌యూవీని కొనుగోలు చేసింది. గతంలో మెర్సిడెస్ బెంజ్ సైన్యం కోసం రూపొందించిన జి-సిరీస్ ఎస్‌యూవీలో కంపెనీ తాజాగా లైట్ వెయిట్ ప్యాసింజర్ వెర్షన్ జి-సిరీస్‌ను ప్రవేశపెట్టింది.

ఇది చూడటానికి మహీంద్రా బొలెరో మాదిరి ఉన్నప్పటికీ, టెక్నాలజీ, డ్రైవింగ్ అండ్ హ్యాండ్లింగ్, ఆఫ్-రోడింగ్ వంటి పలు అంశాల పరంగా గమనిస్తే ఇది ఎన్నోరెట్లు మెరుగ్గా ఉంటుంది. కిమ్ కర్దాషియన్ కొనుగోలు చేసిన సరికొత్త 2012 వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ జి63 ఎస్‌యూవీ ధర రూ.1,50,000 అమెరికన్ డాలర్లు. మన దేశ కరెన్సీలో ఇది సుమారు రూ.75 లక్షలకు పై మాటే. ఇప్పటి వరకూ 2012 వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ జి63 ఎస్‌యూవీ మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంది.
కాగా.. 2013 వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ జి63 ఎస్‌యూవీ ఇంకా మార్కెట్లోకి విడుదల కావల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2013 వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ జి63 ఎస్‌యూవీని సొంతం చేసుకోనున్న తొలి కస్టమర్ కూడా కిమ్ కర్దాషియన్ కావటం విశేషం. స్వతహాగా మోటార్ వాహనాలంటే మంచి క్రేజ్ ఉన్న కిమ్ ఇటీవలి కాలంలో కొత్త వాహనాలపై సుమారు 1.2 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్లు సమాచారం. కిమ్ కర్దాషియన్ తాజాగా తన కొత్త ప్రేమికుడు కేన్ వెస్ట్‌కు సుమారు రూ.3 కోట్ల ఖరీదు చేసే లాంబోర్గినీ అవెంటేడర్ కారును కానుకగా ఇచ్చింది.
మెర్సిడెస్ బెంజ్ జి63 మిలటరీ వెర్షన్ ఎస్‌యూవీని అనేక దేశాల్లో భద్రతా బలగాలు ఉపయోగిస్తుంటాయి. ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా వంటి దేశాల్లో కంపెనీ ఈ ఎస్‌యూవీని విక్రయిస్తోంది. ఇటీవలే భారతదేశంలో కూడా మెర్సిడెస్ బెంజ్ ఈ ఎస్‌యూవీని విడుదల చేయటం జరిగింది. గతంలో టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవణ్ కళ్యాన్ కూడా ఇదే ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. కిమ్ కర్దాషియాన్ వద్ద రేంజ్ రోవర్, బెంట్లీ కాంటినెంటల్, ఫెరారీ 458 ఇటాలియా, రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఆర్ వంటి కార్లు ఉన్నాయి.
ఇకపోతే 2013 వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ జి63 ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇందులో పవర్‌ఫుల్ 5.5 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది కేవలం 5.3 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. అడవులు, ఇసుక రోడ్లు, కొండ ప్రాంతాలు వంటి ఆఫ్-రోడ్ ప్రయాణాలకు ఇది అన్ని విధాలుగా అనువుగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








