మార్చ్ 2013 నాటికి మహీంద్రా వెరిటో కాంపాక్ట్ సెడాన్
Verito ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న వన్ అండ్ ఓన్లీ సెడాన్ వెరిటో త్వరలోనే మరో కొత్త అవతారంలో దర్శనమివ్వనుంది. మహీంద్రా వెరిటోపై ఎక్సైజ్ రాయితీలను పొందటం ద్వారా తక్కువ ధరకే ఈ కారును అందించాలనే ఉద్దేశ్యంతో ఎమ్ అండ్ ఎమ్ ఇందులో నాలుగు మీటర్ల కన్నా పొడవు తక్కువగా ఉండే వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆటోమొబైల్ నిబంధనల ప్రకారం, నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు ఉండే కార్లను చిన్న కార్లుగా పరిగణించి వాటిపై ఎక్సైజ్ రాయితీలను అందించడం జరుగుతుంది.
కొత్తగా మార్కెట్లోకి రానున్న ఈ కాంపాక్ట్ మహీంద్రా వెరిటో సెడాన్, కంపెనీ ఇటీవలే విడుదల చేసిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వెరిటో సెడాన్ డిజైన్‌ను పోలి ఉండనుంది. అంతేకాకుండా, ఇందులో ఉపయోగించిన 1.4 లీటర్ పెట్రోల్, 1.5 లీటల్ డీజిల్ ఇంజన్లే ఇందులో కూడా ఉపయోగించనున్నారు. పెట్రోల్ వెర్షన్ వెరిటోలో ఉపయోగించిన 1.4 లీటర్ ఇంజన్ గరిష్టంగా 75 హెచ్‌పిల శక్తిని, 110 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్ వెరిటోలో ఉపయోగించిన 1.5 లీటర్ ఇంజన్ గరిష్టంగా 65 హెచ్‌పిల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కొత్త కాంపాక్ట్ వెరిటో పొడవును తగ్గించేందుకు గాను వెనుక వైపు డిజైన్‌లో మార్పులు చేయనున్నారు. తగ్గించబడిన బూట్ స్పేస్, రీడిజైన్ చేయబడిన బంపర్ వంటి ప్రధాన మార్పులు కొత్త వెరిటోలో ఉండనున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న వెరిటో సెడాన్ 4247 మి.మీ. పొడవును కలిగి ఉంది. కాగా.. కంపెనీ అభివృద్ధి చేస్తున్న కాంపాక్ట్ వెరిటో సెడాన్ 4000 మి.మీ. కన్నా తక్కువ పొడవును కలిగి ఉండనుంది. ఇది మార్చ్ 2012 నాటికి మార్కెట్లోకి రానుంది. కొత్త కాంపాక్ట్ మహీంద్రా వెరిటో ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వంటి కాంపాక్ట్ సెడాన్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
2012 మహీంద్రా వెరిటోలో మార్పులు:
ఇదిలా ఉండగా.. మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన సరికొత్త 2012 మహీంద్రా వెరిటోలో క్రోమ్ ప్లేటెడ్ ఫ్రంట్ గ్రిల్, సరికొత్త ఫ్రంట్ బంపర్, కొత్త హెడ్‌లైట్స్, కొత్త స్టయిలిష్ ఫాగ్ ల్యాంప్స్, క్లాసీ లుక్ కలిగిన సరికొత్త అల్లాయ్ వీల్స్, స్టయిలిష్ రూఫ్ రెయిల్స్, కొత్త డిజైన్ కలిగిన పిల్లర్స్, క్లియర్ లెన్స్ కలిగిన టెయిల్ ల్యాంప్స్, సరికొత్త బూట్ లిడ్, ఇంటిగ్రేటెడ్ రిఫ్లెక్టర్స్‌తో కూడిన సరికొత్త రియర్ బంపర్ వంటి ఎక్స్టీరియర్ మార్పులు ఉన్నాయి.
అంతేకాకుండా.. రెండు రంగుల కలయికతో కూడిన డ్యాష్‌బోర్డ్ ప్యానెల్, సిడి, ఎమ్‌పి3, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ కనెక్టివిటీతో కూడిన 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్, సైడ్ మిర్రర్లను యాంత్రికంగా నియంత్రించేందుకు డ్యాష్ బోర్డ్‌పై ఏర్పాటు చేసిన కంట్రోల్స్, డ్రైవర్ వైపు డోర్‌పై ఏర్పాటు చేసిన పవర్ విండో స్విచ్‌లు, సరికొత్త ఏసి కంట్రోల్స్ వంటి మార్పులు చేర్పులు కూడా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో లభించే మహీంద్రా వెరిటో వేరియంట్లు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
Petrol Version:
* Mahindra Verito BS3 1.4 G2 - INR 5,16,445
* Mahindra Verito BS3 1.4 G4 - INR 5,44,047
* Mahindra Verito BS4 1.4 G2 - INR 5,22,434
* Mahindra Verito BS4 1.4 G4 - INR 5,44,303
Diesel Version:
* Mahindra Verito BS3 1.5 D2 - INR 6,00,390
* Mahindra Verito BS3 1.5 D4 - INR 6,33,093
* Mahindra Verito BS3 1.5 D6 ABS - INR 7,00,152
* Mahindra Verito BS4 1.5 D2 - INR 6,20,786
* Mahindra Verito BS4 1.5 D4 - INR 6,42,610
* Mahindra Verito BS4 1.5 D6 ABS - INR 7,09,666
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)


Click it and Unblock the Notifications









