ఆటోమేటిక్ వేరియంట్ మహీంద్రా స్కార్పియో ఉత్పత్తి బంద్!
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మహీంద్రా స్కార్పియోలో లభిస్తున్న ఆటోమేటిక్ వేరియంట్ మరికొద్ది నెలల్లో కనుమరుగైపోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (ఆటోమేటిక్ గేర్‌బాక్స్) లభ్యత కొరత కారణంగా, ఈ వేరియంట్ ఉత్పత్తిని నిలిపివేయాలని కంపెనీ యోచిస్తోంది.
ఆటోమేటిక్ వేరియంట్ మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీలో ఉపయోగించిన సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఆస్ట్రేలియాకు చెందిన డ్రైవ్‌ట్రైన్ సిస్టమ్ ఇంటర్నేషల్ (డిఎస్ఐ) సరఫరా చేసేది. అయితే, ప్రస్తుతం ఈ కంపెనీ మహీంద్రా అండ మహీంద్రాకు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లను సరఫరా చేయడాన్ని నిలిపివేసింది. దీంతో ప్రస్తుత స్టాక్ క్లియర్ అయిన తర్వాత, కొత్తగా ఆటోమేటిక్ వేరియంట్ మహీంద్రా స్కార్పియో ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసే సూచనలు కనిపిస్తున్నాయి.
కాగా.. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతం ఆటోమేటిక్ స్కార్పియో రెండు వేరియంట్లలో టూవీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో లభిస్తుంది. మహీంద్రా స్కార్పియో విఎల్ఎక్స్ 2-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ.11.21 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా, మహీంద్రా స్కార్పియో విఎల్ఎక్స్ 4-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ.12.63 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.
డిఎస్ఐ గత 2007 నుంచి మహీంద్రా అండ్ మహీంద్రాకు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లను సరఫరా చేస్తుంది. ఈ కంపెనీ గత 2009లో దివాళ స్థాయికి చేరుకున్నప్పటికీ, ఎమ్ అండ్ ఎమ్‌కు ట్రాన్సిమిషన్లను సరఫరా చేయడాన్ని మాత్రం నిలిపివేయలేదు. మార్చ్ 2009లో డిఎస్ఐను చైనాకు చెందిన గీలే ఆటోమొబైల్ హోల్డింగ్స్ స్వాధీనం చేసుకుంది. అయినప్పటికీ, డిఎస్ఐ క్లయింట్లకు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లను సరఫరా చేయడాన్ని మాత్రం నిలిపివేయలేదు.
ఫోర్-స్పీడ్, సిక్స్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లను డిఎస్ఐ సరఫరా చేస్తుంది. ఫోర్డ్, క్రిస్లర్, శాంగ్‌యాంగ్ వంటి కంపెనీలకు డిఎస్ఐ తమ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లను సరఫరా చేస్తుంది. అయితే, తాజాగా, ఎమ్ అండ్ ఎమ్‌కు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లను సరఫరా చేయడాన్ని డిఎస్ఐ నిలిపివేయడంతో, ఆటోమేటిక్ వెర్షన్ మహీంద్రా స్కార్పియో ఉత్పత్తి కూడా నిలిచిపోయేలా ఉంది. ఏదేమైనప్పటికీ, వేరే ఇతర కంపెనీ నుంచి మహీంద్రా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లను కొనుగోలు చేసినట్లయితే, ఈ వేరియంట్ ఉత్పత్తి యధావిధిగా కొనసాగే అవకాశం కూడా ఉంది.


Click it and Unblock the Notifications








