ఆస్టన్ మార్టిన్‌ను కొనుగోలు చేసే రేస్‌లో మహీంద్రా
జేమ్స్ బాండ్ సినిమాల్లో అత్యంత పాపులర్ అయిన బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆస్టన్ మార్టిన్ ఇప్పుడు అమ్మకానికి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, ఆస్టన్ మార్టిన్ యొక్క కువైటీ యజమానులు కంపెనీలోని తమ మెజారీటీ వాటాలను విక్రయించేందుకు పటిష్టమైన కొనుగోలుదారులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. ఈ వాటాల కొనుగోలు రేస్‌లో మన దేశానికి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) కూడా ఉందనే కథనాలు వెలువడుతున్నాయి.
ఆస్టన్ మార్టిన్‌లో దాదాపు 64 శాతం వాటా కలిగిన 'ఇన్వెస్టిమెంట్ డార్' ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తమ ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించుకునేందుకు ఈ కంపెనీ ఆస్టన్ మార్టిన్‌లో ఉన్న తమ వాటాలను విక్రయించాలని యోచిస్తోంది. ఈ విక్రయంపై తమకు సలహా ఇచ్చేందుకు గాను 'రోథ్స్‌ఛైల్డ్'ను ఇన్వెస్టిమెంట్ డార్ తమ సలహాదారుగా నియమించుకుంది. ఈ వాటాల అమ్మకం విషయంపై గడచిన కొద్ది నెలలుగా పలు పటిష్టమైన కొనుగోలుదారులతో ప్రత్యేక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
గడచిన ఐదేళ్ల క్రితం ఆస్టన్ మార్టిన్‌ను కొనుగోలు చేసిన ధరకే ఈ వాటాలను విక్రయించాలని ఇన్వెస్టిమెంట్ డార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్వెస్టిమెంట్ డార్ 2007లో 800 మిలియన్లను వెచ్చించి ఈ వాటాలను కొనుగోలు చేసింది. మనదేశ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.4,400 కోట్లు. అయితే, ఈ వాటాల అమ్మకం గురించి ఇటు ఆస్టన్ మార్టిన్ కంపెనీ కానీ, దాని యజమానుల వద్ద నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, ఇన్వెస్టిమెంట్ డార్‌తో సంబంధం ఉన్న అధికారుల సమాచారం ప్రకారం, ఈ సంస్థ తమ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఈ వాటాల అమ్మకం ఒక్క మార్గమని తెలుస్తోంది.
ఆస్టన్ మార్టిన్‌ను కొనుగోలు చేయగల పటిష్టమైన కొనుగోలుదారుల్లో మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఒకటి. ఒకవోళ మహీంద్రా ఈ వాటాలను కొనుగోలు చేసినట్లయితే, దాని వలన కంపెనీకు ఎంతమేర ఆదాయం వాటిళ్లుతందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారనుంది. మహీంద్రా ఇటీవలే కొరియాకు చెందిన ప్యాసింజర్ ఆటోమొబైల్ కంపెనీ శాంగ్‌యాంగ్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఆస్టన్ మార్టిన్‌ను కూడా మహీంద్రా కొనుగోలు చేసినట్లయితే, మహీంద్రా ఖాతాలో లగ్జరీ కార్ బ్రాండ్ వచ్చి చేరటమే కాకుండా, గ్లోబల్ మార్కెట్లో కూడా మహీంద్రాకు మంచి గుర్తింపు లభించే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications









