సెప్టెంబర్ 18న మార్కెట్లోకి రానున్న మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్
మెర్సిడెస్ బెంజ్ ఇండియా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిన్న కారు 'బి-క్లాస్' విడుదలకు ముహుర్తం ఖరారైంది. గడచిన జులై నెలలో గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్‌ను కంపెనీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. మెర్సిడెస్ బెంజ్ స్పోర్ట్స్ టూరర్‌గా పిలిచే ఈ చిన్న కారును ఈనెల 18న కంపెనీ దేశీయ విపణిలో వాణిజ్య పరంగా ప్రవేశపెట్టనుంది.
భారత లగ్జరీ కార్ సెగ్మెంట్లో తక్కువ ధర కలిగిన చిన్న కార్లకు పోటీ పెరుగుతున్న నేపథ్యంలో, మెర్సిడెస్ బెంజ్ తమ పాపులర్ బి-క్లాస్ కారును అనుకున్న సమయాని కన్నా ముందే మార్కెట్లో విడుదల చేస్తోంది. గ్లోబల్ మార్కెట్లో మంచి ఆదరణ సొంతం చేసుకున్న మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్‌ను భారతీయ మార్కెట్ పరిస్థితులు, కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా కంపెనీ తీర్చిదిద్దింది.
సెడాన్ లాంటి సౌకర్యాన్ని, ఎమ్‌పివి లాంటి ఫ్లెక్సిబిలిటీని, ఎస్‌యూవీ లాంటి పవర్‌ను కలిగి ఉండేలా తీర్చిదిద్దిన ఈ మెర్సిడెస్ బెంజ్ స్పోర్ట్స్ టూరర్‌ను సెప్టెంబర్ 18, 2012న కంపెనీ ముంబైలో లాంఛనంగా విడుదల చేయనుంది. ప్రస్తుతానికి ఈ మోడల్ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియన్ మార్కెట్లోకి దిగుమతి కానుంది. దేశీయ విపణిలో ఈ చిన్న కారుకు ప్రోత్సాహకర డిమాండ్ లభించినట్లయితే, మెర్సిడెస్ బెంజ్ భవిష్యత్తులో బి-క్లాస్ కారును ఇక్కడి మార్కెట్లో అసెంబ్లింగ్ చేసే ఆస్కారం ఉంది.
ప్రారంభంలో భాగంగా, మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభ్యం కానుంది. 2013 ఆరంభంలో డీజిల్ వెర్షన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది రెండు వేరియంట్లలో (బి 180, బి 180 స్పోర్ట్) లభ్యం కానుంది. ఇందులో ఉపయోగించిన 1.6 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టం 122 హెచ్‌పిల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ గురించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications









