'ఆర్350 సిడిఐ 4మ్యాటిక్'ను విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా మరో సరికొత్త వేరియంట్‌ను తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న ఆర్-క్లాస్ సిరీస్ క్రాసోవర్‌లో ఓ కొత్త డీజిల్ వేరియంట్ ఆర్350 సిడిఐ 4మ్యాటిక్ (R350 CDI 4MATIC)ను గురువారం మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో మెర్సిడెస్ బెంజ్ ఆర్-క్లాస్ ఆర్350 సిడిఐ 4మ్యాటిక్ ధర రూ.58.9 లక్షలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ)గా ఉంది.
అత్యంత విలాసవంతమైన మరియు ఖరీదైన ఇంటీరియర్స్, స్టయలిష్ ఎక్స్టీరియర్స్, పొడవాటి వీల్ బేస్, 2987సీసీ వి6 డీజిల్ ఇంజన్, 7జి ట్రానిక్, 4మ్యాటిక్స్, థెర్మోట్రానిక్, పార్క్‌ట్రానిక్, ఎయిర్ సస్పెన్షన్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హెడ్‌ల్యాంప్స్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఈ ఆర్350 సిడిఐ 4మ్యాటిక్ సొంతం. మెర్సిడెస్ బెంజ్ ఆర్350 సిడిఐ 4మ్యాటిక్ క్రాసోవర్ ఇటు సెడాన్ పెర్ఫామెన్స్‌ను అటు ఆల్-వీల్ డ్రైవ్ కలిగి ఎస్‌యూవీ కాన్ఫిడెన్స్‌ను అందిస్తుంది.
భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న పెట్రోల్ వెర్షన్ ఆర్-క్లాస్ ఆర్350 4మ్యాటిక్ మంచి సక్సెస్‌ను సాధించిన నేపథ్యంలో, ఇందులో కొత్త డీజిల్ వేరియంట్‌ను కంపెనీ పరిచయం చేయటం జరిగింది. ఈ సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) దెబాషిస్ మిత్రా మాట్లాడుతూ.. సక్సెస్‌ఫుల్ పెట్రోల్ వెర్షన్ మెర్సిడెస్ బెంజ్ ఆర్-క్లాస్‌కు అదనంగా, డీజిల్ వెర్షన్ ఆర్350 సిడిఐ 4మ్యాటిక్‌ను ప్రవేశపెడుతున్నామని, ఈ డీజిల్ వేరియంట్‌ను కొనుగోలుదారులు ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఆటోమొబైల్ కార్ మార్కెట్లో డీజిల్ కార్ల ట్రెండ్ నడుస్తుండటంతో, లగ్జరీ కార్ కంపెనీలు కూడా ఇదే బాట పట్టాయి. పెట్రోల్ వెర్షన్ కార్ల కన్నా డీజిల్ వెర్షన్ కార్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. మెర్సిడెస్ బెంజ్ ఆర్350 సిడిఐ 4మ్యాటిక్ క్రాసోవర్ 7జి-ట్రానిక్ గేర్‌బాక్స్‌తో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుందని, ఇది లీటరు డీజిల్‌కు 11.25 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని ఆయన వివరించారు. కంఫర్టబల్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కలిగి ఈ కొత్త ఆర్-క్లాస్‌లో ఏడుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.
విశాలమైన ఇంటీరియర్ స్పేస్, లగేజ్ స్పేస్‌లను కలిగి ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఆర్-క్లాస్ దూరప్రయాణాలకు అనువుగా ఉంటుంది. స్పోర్టీ అల్యూమినియం ట్రిమ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 18-ఇంచ్ 10-స్పోక్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ ప్యాకేజ్, ఎల్ఈడి డేటైమ్ రన్నింద్ లైట్స్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లతో కొత్త ఆర్-క్లాస్ మరింత స్టయిలిష్, స్పోర్టీ లుక్‌నిస్తుంది.
ఇక కొత్త ఆర్-క్లాస్ ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. ఇందులో సిక్స్-డిస్క్ సిడి ఛేంజర్ కలిగిన ఆడియో సిస్టమ్ మరియు యూనివర్సల్ మీడియా ఇంటర్‌ఫేస్‌ను డ్యాష్ బోర్డులో అమర్చారు. యాంత్రికంగా నియంత్రించబడే టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, మెమరీ సీట్స్, త్రీ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక సీటులోని ప్రయాణికుల కోసం రియర్ ఎసి వెంట్స్ వంటి ఫీచర్లను జోడించారు.


Click it and Unblock the Notifications









