సెప్టెంబర్ 15న కొత్త మారుతి ఆల్టో 800 విడుదల?
ఆధునిక కాలుష్య నిబంధనల దృష్ట్యా మెట్రో నగరాల్లో మాయమైపోయిన మారుతి 800 స్థానాన్ని భర్తీ చేస్తూ, ఆ స్థానంలో ఓ సరికొత్త ఆల్టో 800 కారును మారుతి సుజుకి అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా మార్కెట్ సమాచారం ప్రకారం, మారుతి సుజుకి ఈ కొత్త కారును ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా ఈనెల 15వ తేదీన మార్కెట్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
గతంలో మానేసర్ ప్లాంట్ మూతపడి ఉన్నప్పటికీ కూడా, ఈ కారును మార్కెట్లో విడుదల చేయటంలో ఎలాంటి జాప్యం ఉండబోదని, అనుకున్న సమయానికంటే ముందుగానే కొత్త ఆల్టో 800ను మార్కెట్లోకి తీసుకువస్తామని కంపెనీ పేర్కొనటం జరిగింది. వాస్తవానికి కొత్త మారుతి ఆల్టో 800 దీపావళి నాటికి మార్కెట్లో విడుదల కావలసి ఉంది. అయితే, అంతకన్నా ముందుగానే (సెప్టెంబర్ 15, 2012) ఈ కారు మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది.
కొత్త మారుతి ఆల్టో 800 కారు ఉత్పత్తి వ్యయాన్ని అదుపులో ఉంచి, తక్కువ ధరకే ఈ కారును వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు గాను, దీనిని ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మారుతి సుజుకి ఆల్టో 800సీసీ కారు ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేశారు. ప్రస్తుత వెర్షన్ కన్నా ఇది మెరుగైన మైలేజ్‌ను ఆఫర్ చేయనుంది. మారుతి కొత్త 800 కారు విడుదల గురించి కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
మరి ఇది రూమరా లేక నిజమా అని తేలాలంటే సెప్టెంబర్ 15 వరకూ వేచి చూడాల్సింది. ఇటీవలి కాలంలో మారుతి సుజుకి అప్‌గ్రేడెడ్ మోడళ్లను ఎలాంటి ఆర్భాటం లేకుండా విడుదల చేస్తోంది. సరికొత్త అప్‌గ్రేడెడ్ మారుతి సుజుకి రిట్జ్‌ను కూడా కంపెనీ సైలెంట్‌గా దేశీయ విపణిలో విడుదల చేసిన విషయం విధితమే. కొత్త ఆల్టోలో 796సీసీ ఎఫ్8డి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. పాత వెర్షన్ కన్నా ఇది మెరుగైన పవర్, టార్క్, మైలేజ్‌లను ఆఫర్ చేస్తుంది.
కొత్త మారుతి ఆల్టో 800లో మరింత విశాలమైన, సరికొత్త ఇంటీరియర్స్ ఉండనున్నాయి. ఇంకా ఇందులో సరికొత్త ఫ్రంట్ డిజైన్, హెడ్‌ల్యాంప్స్, చిన్న క్రోమ్ గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్, సరికొత్త రియర్ డిజైన్ వంటి మార్పులను కూడా గమనించవచ్చు. చిన్న కార్ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇచ్చేందుకు గాను రూ.2 లక్షల ధరల శ్రేణిలో ఈ కారును మార్కెట్లో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. అమ్మకాల పరంగా పతనమవుతున్న మారుతి సుజుకిని కొత్త ఆల్టో 800 గట్టెక్కిస్తుందో లేదో చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








