హ్యుందాయ్ ఫ్లూయిడిక్ ఎలాంట్రా బుకింగ్స్ ప్రారంభం
దేశపు ద్వితీయ అగ్రగామి కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ఎలాంట్రా సెడాన్‌లో ఓ సరికొత్త వేరియంట్‌ను కంపెనీ మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే కొత్త ఎలాంట్రా కోసం హ్యుందాయ్ బుకింగ్‌లను స్వీకరిస్తోంది. హ్యుందాయ్ నుంచి అత్యంత సక్సెస్ అయిన ఫ్లూయిడిక్ డిజైన్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని సరికొత్త ఫ్లూయిడిక్ ఎలాంట్రాను కంపెనీ రూపొందించింది.
గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ తొలిసారిగా తమ సరికొత్త ఫ్లూయిడిక్ ఎలాంట్రా ప్రీమియం సెడాన్‌ను భారత విపణిలో ఆవిష్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆటోమొబైల్ అవార్డులను సొంతం చేసుకున్న హ్యుందాయ్ ఎలాంట్రా ఇండియన్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభ్యం కానుంది. కొత్త హ్యుందాయ్ ఫ్లూయిడిక్ ఎలాంట్రా ధర రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.
కొత్త హ్యుందాయ్ ఫ్లూయిడిక్ ఎలాంట్రాను ఎస్ఎమ్ఎస్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా హ్యుందాయ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎలాంట్రా అని టైప్ చేసి 53456కు ఎస్ఎమ్ఎస్ చేయటమే (SM HYUNDAI ELANTRA to 53456). ఈ కొత్త కారును ముందుగా బుక్ చేసుకున్న వారు ఆకర్షనీయమైన బహుమతులను కూడా గెలుచుకునే అవకాశం ఉంది.
హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ హ్యుందాయ్ ఫ్లూయిడిక్ వెర్నా, లగ్జరీ సెడాన్ హ్యుందాయ్ సొనాటాలకు మధ్యలో ఓ ప్రీమియం సెడాన్‌ను కోరుకునే వారికి హ్యుందాయ్ ఫ్లూయిడిక్ ఎలాంట్రా ఒక మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది. డి-సెగ్మెంట్ సెడాన్ మార్కెట్లోని హోండా సివిక్, చెవర్లే క్రూజ్, టొయోటా కరోలా ఆల్టిస్, ఫోక్స్‌వ్యాగన్ జెట్టా, స్కొడా లారా, రెనో ఫ్లూయెన్స్ వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీగా నిలువనుంది.


Click it and Unblock the Notifications









