జనవరి నుంచి ప్రియం కానున్న నిస్సాన్ కార్లు
కొత్త సంవత్సరంలో నిస్సాన్ కార్లు మరింత ప్రియం కానున్నాయి. ఇతర కార్ కంపెనీల బాటలో నిస్సాన్ ఇండియా కూడా వచ్చే జనవరి నుంచి ఉత్పత్తుల ధరలు పెంచాలని నిర్ణయించింది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయం, కరెన్సీ ఒడిదుడుకుల నేపథ్యంలో జనవరి 2013 నుంచి తమ అన్ని ఉత్పత్తుల ధరలు పెంచుతామని జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా ప్రకటించింది. అయితే, ఏయే మోడళ్లపై ఎంత మేర ధరలను పెంచనున్నామనే విషయాన్ని మాత్ర కంపెనీ వెల్లడించలేదు.
ప్రస్తుతం నిస్సాన్ ఇండియా దేశీయ మార్కెట్లో అన్ని సెగ్మెంట్లలో ఉత్పత్తులను ఆఫర్ చేస్తుంది. మైక్రా హ్యాచ్‌బ్యాక్, సన్నీ సెడాన్, ఇవాలియా ఎమ్‌పివిలతో పాటుగా ప్రీమయం సెడాన్ టియానా, ప్రీమియం ఎస్‌యూవీ ఎక్స్-ట్రైల్, స్పోర్ట్స్ కార్ 370జెడ్ లను నిస్సాన్ ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తోంది. కాగా.. ఇందులో మైక్రా, సన్నీ, ఇవాలియాలను దేశీయంగానే ఉత్పత్తి చేస్తుండగా, టియానా, ఎక్స్‌ట్రైల్, 370జెడ్‌లను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకొని భారత మార్కెట్లో విక్రయిస్తోంది.
ఇప్పటికే మారుతి సుజుకి ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టొయోటా, జనరల్ మోటార్స్ వంటి కంపెనీ వచ్చే ఏడాది ఆరంభం నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్యాసింజర్ కార్ కంపెనీలే కాకుండా మెర్సిడెస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ కంపెనీలు కూడా ఇదే నెపంతో ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. జనవరి నుంచి మెర్సిడెస్ బెంజ్ కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నట్లు పేర్కొంది. ఇదే బాటలోనే బిఎమ్‌డబ్ల్యూ, ఆడి ఇండియా కంపెనీలు తమ మోడళ్ల ధరలను పెంచనున్నాయి. మొత్తమ్మీద కొత్త సంవత్సరంలో కొత్త కార్లు కొనుగోలుదారులపై అదనపు భారాన్ని మోపనున్నాయి.


Click it and Unblock the Notifications









