ఐకార్ (iCar)ను అభివృద్ధి చేయాలని కలగన్న స్టీవ్ జాబ్స్
యాపిల్ ఎలక్ట్రానిక్ పరికరాలతో ప్రపంచ సాంకేతిక రంగంలో పెనుమార్పులకు తెరలేపి, ప్రపంచపు అగ్రగామిగా నిలిచిన యాపిల్ గ్రూప్ సీఈఓ దివంగత స్టీవ్ జాబ్స్ తన కోరిక తీరకుండానే మరణించారు. తాను మరణించడాని కంటే ముందుగానే ఓ ఐకార్ (iCar)ను డిజైన్ చేయాలని స్టీవ్ తలచారు. ఈ నిజాన్ని జె. క్రూ సీఈఓ మరియు బోర్డ్ మెంబర్ మైకీ డ్రెక్స్లర్ వెల్లడించారు.
అమెరికాలో ఉపయోగిస్తున్న కార్లలో సుమారు 90 శాతానికి పైగా కార్లలో ఐపాడ్ కనెక్టివిటీ ఉండటంతో స్టీవ్ మదిలో ఓ కొత్త ఆలోచన తలెత్తింది. తామే ఎందుకు 'ఐ' టెక్నాలజీతో కూడిన కార్లను తయారు చేయకూడని స్టీవ్ భావించారని డ్రెక్స్లర్ తెలిపారు.

"అమెరికాలో ఉన్న కార్ పరిశ్రమను చూడండి, ఇది చాలా విచారకరమైనది. అసలు ఇలాంటి కార్లను ఎవరు డిజైన్ చేస్తున్నారు. ఒకవేళ స్టీవ్ చనిపోక ముందే ఓ ఐకార్‌ను డిజైన్ చేసి ఉన్నట్లయితే, ఇప్పుడు మార్కెట్లో 50 శాతానికి పైగా అవే కార్లు ఉండేవి. కానీ అతను ఆ కారును డిజైన్ చేయలేద"ని డ్రెక్స్లర్ ఓ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు.
ఐపాడ్ (మ్యూజిక్ ప్లేయర్), ఐఫోన్ (మొబైల్ ఫోన్), ఐప్యాడ్ (టాబ్లెట్ పిసి)తో ప్రపంచ సాంకేతిక రంగంలో ఓ సరికొత్త విప్లవాన్ని తీసుకువచ్చిన స్టీవ్ జాబ్స్ తన మెదడుకు పనిపెట్టి ఓ ఐకార్‌ను డిజైన్ చేసి ఉంటే అది ఎంత పాపులర్ అయి ఉండేదో మనం ఊహించుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని కంపెనీలు రూపొందిస్తున్న కాన్సెప్ట్ కార్లను ఐప్యాడ్ ద్వారా నియంత్రించడాన్ని (కంట్రోల్ చేయటం) మనం గమనిస్తూనే ఉన్నాం. స్టీవ్ జాబ్ కలను యాపిల్ సంస్థయినా నిజం చేయాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications








