అప్‌గ్రేడెడ్ గ్రాండ్ విటారా ఎస్‌యూవీ విడుదల చేసిన సుజుకి
మారుతి సుజుకి అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ 'గ్రాండ్ విటారా' గుర్తుందా..? ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్లో అంతంత మాత్రంగానే అమ్ముడవుతున్నప్పటికీ, గ్లోబల్ మార్కెట్లలో ఈ మోడల్‌కు మంచి డిమాండ్ ఉంది. భారత్‌లో లభిస్తున్న గ్రాండ్ విటారా ఎస్‌యూవీని మారుతి సుజుకి మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ అభివృద్ధి చేసింది. సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో మారుతి ఈ కారును ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించడం జరుగుతోంది.
కాగా.. ఇప్పుడు గ్రాండ్ విటారాలో ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్ సుజుకి మోటార్ కో. జపాన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త గ్రాండ్ విటారా త్వరలోనే ఇండియన్ మార్కెట్లో కూడా విడదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారత ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలు ప్రవేశించడంతో ఈ సెగ్మెంట్లో పోటీ వాతావరణం నెలకొనడంతో మారుతి సుజుకి ఇండియా ఈ సెగ్మెంట్లో తన సత్తా ఏంటో చూపించాలనుకుంటోంది.
ఈ నేపథ్యంలో ఇటీవలే జపాన్‌లో విడుదలైన సరికొత్త ఫేస్‌లిఫ్ట్ గ్రాండ్ విటారా ఎస్‌యూవీని ఇండియాకు తీసుకువచ్చేందుకు మారుతి సుజుకి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గ్రాండ్ విటారా ఎస్‌యూవీ జపనీస్ మార్కెట్లో ఎస్కుడో (Escudo) అనే పేరుతో లభ్యమవుతోంది. సుజుకి మోటార్ కార్పోరేషన్ కొత్త గ్రాండ్ విటారా ఎస్‌యూవీలో సరికొత్త ఫీచర్లను జోడించి ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలకు సవాలుగా తీర్చిదిద్దింది.
కొత్త 2013 వెర్షన్ సుజుకి గ్రాండ్ విటారాలో సరికొత్త ఫ్రంట్ డిజైన్, రీడిజైన్ చేయబడిన గ్రిల్ (హనీకోంబ్ డిజైన్ కలిగిన గ్రిల్), బంపర్, 4-వీల్ డ్రైవ్ ఆప్షన్, ఆఫ్-రోడ్ డ్రైవింగ్ విభిన్న డ్రైవింగ్ మోడ్స్ వంటి అనేక మార్పులతో ఇది లభ్యమవుతుంది. ఇందులో అమర్చిన 2.4 లీడర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 165 పిఎస్‌ల శక్తిని, 225 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
సరికొత్త 2013 వెర్షన్ గ్రాండ్ విటారా ఎస్‌యూవీతో పాటుగా ఇందులో మరొ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. సుజుకి గ్రాండ్ విటారా ఎక్స్-అడ్వెంచర్ అనే పేరుతో లభ్యం కానున్న ఈ కొత్త ఎస్‌యూవీలో ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌కు అనుగుణంగా ఫీచర్లను తీర్చిదిద్దారు. బిసన్ బ్రౌన్ పెరల్ మెటాలిక్ రంగులో లభ్యమయ్యే ఈ ఎస్‌యూవీలో 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, సన్‌రూఫ్, డ్యూయెల్ టోన్ సీట్స్, లెథర్‌తో కప్పబడిన స్టీరింగ్ వీల్, గేర్ నాబ్ వంటి అదనపు ఫీచర్లు లభిస్తాయి.


Click it and Unblock the Notifications









