ఈ ఏడాది చివరి నాటికి టాటా 'గాలి' కార్లు వస్తాయట..!!
ప్రపంచంలో కెల్లా అత్యంత చవక ధరకే కారును (టాటా నానో) తయారు చేసి, ఆటోమొబైల్ రంగంలో ఓ సరికొత్త సంచలనాన్ని సృష్టించిన టాటా మోటార్స్, ఇటీవల గాలితో నడిచే కార్లను విజయవంతంగా పరీక్షించామని ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా... మోటార్ డెవలప్‌మెంట్ ఇంటర్నేషనల్ (లక్సెంబర్గ్) నుండి టాటా మోటార్స్ లైసెన్స్ పొంది అభివృద్ధి చేస్తున్న ఎయిర్-పవర్డ్ వాహనాలు ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ఈ కారు అభివృద్ధి మొదటి దశను (టెస్టింగ్ ఫేజ్)ను పూర్తి చేసిన టాటా మోటార్స్ రెండవ దశపై దృష్టి సారించింది. రెండవ దశలో భాగంగా ప్రొడక్షన్‌కు సిద్ధంగా ఉన్న ఎయిర్-పవర్డ్ వాహనాలను టాటా మోటార్స్ తయారు చేయనుంది. కంప్రెస్డ్-ఎయిర్‌తో నడిచే రెండు వాహనాలను టాటా మోటార్స్ డెవలప్ చేసింది. ఇందులో చిన్న తరహా వాణిజ్య వాహనంగానూ, మరొకటి ప్యాసింజర్ కారు గానూ ఉండనున్నాయి.
గడచిన 2007వ సంవత్సరంలో మోటార్ డెవలప్‌మెంట్ ఇంటర్నేషనల్ (లక్సెంబర్గ్) మరియు టాటా మోటార్స్ కంపెనీలు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా, ఎమ్‌డిఐ టెక్నాలజీని ఉపయోగించి కంప్రెస్డ్-ఎయిర్ ద్వారా నడిచే కార్లను టాటా మోటార్స్ ఉత్పత్తి చేసి, ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తుంది. ఈ గాలితో నడిచే వాహనాలు గరిష్టంగా గంటకు 80 కి.మీ. వేగంతో పరుగులు పెడుతూ, సుమారు 300 కి.మీ రేంజ్ వరకూ ప్రయాణిస్తాయి.
టాటా మోటార్స్ అభివృద్ధి చేసిన ఈ ఎయిర్-పవర్డ్ కారులో ఓ ఎయిర్ ట్యాంక్ అమర్చబడి ఉంటుంది. దీనిని నింపడానికి కేవలం రెండు డాలర్లు (సుమారు 100 రూపాయలు) మాత్రమే ఖర్చు అవుతుంది. ఇంటిలో ఉండే ఎయిర్ కంప్రెసర్ ద్వారా ఈ ట్యాంక్‌ను ఫిల్ చేసుకోవడానికి 3-4 గంటల సమయం పడుతుంది. పూర్తి ఎయిర్‌ట్యాంక్‌తో సుమారు 300 కి.మీ. ప్రయాణించవచ్చు. తక్కువు బరువుండేలా ఈ కారును డిజైన్ చేయటం వలన ఎక్కువ దూరం ప్రయాణించేదుకు వీలవుతుంది. దీనిలో కంబ్యూషన్ ఇంజన్ ఉండదు కాబట్టి, కేవలం 50,000 కి.మీ. ఒక్కసారి చొప్పున ఆయిల్ మార్పిడి చేస్తే సరిపోతుంది.


Click it and Unblock the Notifications
