టాటా నానో డీజిల్, సిఎన్‌జి మోడళ్ల విడుదల ఖరారు
టాటా నానో డీజిల్ కారుపై ఉన్న సందేహాలకు తెరపడింది. టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు నానోలో డీజిల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వచ్చే ఏడాదిలో తొలుతగా టాటా నానోలో సిఎన్‌జి వెర్షన్‌ను అందుబాటులోకి తెస్తామని, అనంతరం డీజిల్ వెర్షన్‌ను విడుదల చేస్తామని టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కార్ల్ సిమ్ తెలిపారు. దీంతో టాటా నానో డీజిల్ కారు విడుదలపై ఉన్న సందేహాలకు తెర దించినట్లయింది.
టాటా నానో సిఎన్‌జి వెర్షన్‌ను 2013 జులై నాటికి మార్కెట్లోకి తీసుకువస్తామని, ఆ తర్వాత టాటా నానో డీజిల్ మోడల్‌ను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. సిఎన్‌జి వెర్షన్ టాటా నానోను కంపెనీ గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. టాటా నానో పెట్రోల్ ఇంజన్ తయారీలో జర్మన్ విడిభాగాల తయారీ కంపెనీ బోష్ సాంకేతిక మద్ధతును అందిస్తోంది. అలాగే, డీజిల్ వెర్షన్ ఇంజన్ తయారీలో కూడా బోష్ హస్తం ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం భారత మార్కెట్లో టాటా నానో అమ్మకాలు స్వల్పంగా వృద్ధిని కనబరుస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో మైలేజ్‌కు ప్రాధాన్యతను ఇచ్చే కొనుగోలుదారులు ఈ చిన్న కారును ఆశ్రయిస్తున్నారు. గడచిన సంవత్సరం అక్టోబర్ నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది అక్టోబర్ నెలలో టాటా నానో అమ్మకాలు 4 శాతం వృద్ధిని సాధించి 4,004కు పెరిగాయని ఆయన గుర్తు చేశారు. అయితే, ఈ మోడల్ అమ్మకాలు మాత్రం ఆశించిన స్థాయిలో సాగడటం లేదని ఆయన అంగీకరించారు.


Click it and Unblock the Notifications









