ఆరియా ఫ్లాట్‌ఫామ్‌పై కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తున్న టాటా మోటార్స్
మహీంద్రా అండ్ మహీంద్రా తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టిన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మహీంద్రా క్వాంటో'ను సవాల్ చేస్తూ టాటా మోటార్స్ ఓ కొత్త వాహనాన్ని సిద్ధం చేస్తోంది. టాటా మోటార్స్ నుంచి అంతంత మాత్రంగా అమ్ముడుపోతున్న క్రాసోవర్ టాటా ఆరియా ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకొని ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీ (మినీ ఆరియా)ని కంపెనీ అభివృద్ధి చేస్తోంది. మినీ ఆరియాను భారత రోడ్లపై టెస్ట్ చేస్తుండగా ఓవర్‌డ్రైవ్ క్యాప్చూర్ చేసిన ఫోటోను ఈ కథనంలో గమనించవచ్చు.
మహీంద్రా జైలో ఫ్లాట్‌ఫామ్ క్వాంటోను నిర్మించినట్లుగానే, టాటా ఆరియో క్రాసోవర్‌పై మినీ ఆరియాను టాటా మోటార్స్ నిర్మిస్తోంది. క్వాంటోలో జైలో డిజైన్ క్యూలను ఉపయోగించనట్లుగానే మినీ ఆరియాలోను టాటా ఆరియా డిజైన్ క్యూలు కనిపించనున్నాయి. మినీ ఆరియాలో ఫ్రంట్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఇంటీరియర్స్‌లో మాత్రం కొద్దిపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది. మినీ ఆరియా పేరును టాటా మోటార్స్ ఇంకా ఖరారు చేయలేదు.

ఇక ఇంజన్ విషయానిక వస్తే.. ప్రస్తుతం లభిస్తున్న టాటా ఆరియాలో ఉపయోగించిన 2.2 లీ. డీజిల్ కామన్ రైల్ ఇంజన్ (140 పిఎస్‌ల శక్తి, 320 ఎన్ఎమ్ టార్క్)కు బదులు ఫియట్ నుంచి గ్రహించిన పాపులర్ 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ధరలో మారుతి సుజుకి ఎర్టిగా, మహీంద్రా క్వాంటోలకు చెక్ పెట్టేలా టాటా మోటార్స్ తమ మినీ ఆరియాను ప్రవేశపెట్టనుంది. అత్యంత ఆకర్షనీయమైన ధరకే ఈ చిన్న ఎస్‌యూవీ మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. మరి మినీ టాటా ఆరియా పెద్ద టాటా ఆరియాలా ఫట్ అవుతుందో లేక మార్కెట్లో హిట్ అవుతుందో వేచి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








