ఇండికా దిగువన మరో చిన్న కారును ప్రవేశపెట్టనున్న టాటా
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ చిన్న కార్లపై దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో చిన్న కార్లకు డిమాండు జోరుగా ఉండటంతో, చిన్న కార్ సెగ్మెంట్లో మరిన్ని కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం టాటా మోటార్స్ అందిస్తున్న చవక కారు టాటా నానోకు ఎగువన అలాగ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టాటా ఇండికాకు దిగువ ఓ చిన్న కారును కంపెనీ అభివృద్ధి చేస్తోంది.
టాటా మోటార్స్ ప్రవేశపెట్టనున్న చిన్న కారు ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఆల్టో, హ్యుందాయ్ ఇయాన్ వంటి కార్లను సవాల్ చేయనుంది. చిన్న కార్ మార్కెట్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందనుకున్న టాటా నానో కాస్తా చతికిలబడటంతో మరో కొత్త చిన్న కారుపై కంపెనీ దృష్టి పెట్టింది. ఏదేమైనప్పటికీ, టాటా నానో అమ్మకాలు మాత్రం ఓ మోస్తరుగానే సాగుతున్నాయి.
టాటా నానో కారు కన్నా కాస్తంత విశాలమైన ఇంటీరియర్ స్పేస్, పవర్‌ఫుల్ ఇంజన్ కలిగిన కార్లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు మొగ్గచూపుతుండటంతో, ఈ చిన్న కారును అప్‌గ్రేడ్ చేయటానికి బదులు ఓ కొత్త కారును తయారు చేయాలని కంపెనీ భావిస్తోంది. టాటా మోటార్స్ అభివృద్ధి చేస్తున్న ఈ చిన్న కారు సుమారు రూ.3 లక్షల ధరను కలిగి ఉండనుంది.
మధ్యతరగతి వినియోగదారులను టార్గెట్ చేసుకొని ఈ చిన్న కారు మార్కెట్లోకి రానుంది. టాటా ఇండికా కారును ఎక్కువగా టాక్సీ, క్యాబ్ సర్వీసులకు ఉపయోగిస్తుండటంతో, ప్రత్యేకించి కస్టమర్ల స్వప్రయోజనం కోసం వారి అభిరుచులకు అనుగుణంగా ఈ చిన్న కారు ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిన్న కారుతో పాటుగా మరో రెండు కార్లు టాటా మోటార్స్ నుంచి విడుదల కానున్నాయి.
ఇందులో తొలుతగా టాటా మోటార్స్ గడచిన జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీని ఈ దీపావళి నాటికి మార్కెట్లో ప్రవేశపెట్టనుండగా, టాటా నానోలో డీజిల్ వేరియంట్‌ను వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల చేసే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








