అమెరికా: జే లెనో గ్యారేజ్‌లో టాటా నానోకు చోటు
సాధారణ కస్టమర్లు టాటా నానో కారును కొనుగోలు చేస్తే పెద్ద వింతేమీ కాదు కానీ, సెలబ్రిటీలు టాటా నానో కారును కొంటే మాత్రం అది బ్రేకింగ్ న్యూసే అవుతుంది. ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారుగా చరిత్ర సృష్టించి అగ్రరాజ్యపు (అమెరికా) దృష్టిని సైతం ఆకర్షించిన టాటా మోటార్స్ ప్రజల కారు టాటా నానో, ఇప్పుడు అమెరికాలో సైతం తన టైర్లను మోపింది. అయితే, టాటా నానో కారును అమెరికాకు తీసుకువెళ్లింది మాత్రం టాటా మోటార్స్ కాదు. మరెలా వెళ్లిందనే కదా మీ సందేహం..!
అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన టాక్-షో వ్యాఖ్యాత, హాస్యనటుడు అయిన 'జే లెనో'కు కార్లు, బైకులంటే మహా పిచ్చి. అదని గ్యారేజ్‌లో ఇప్పటికే 200 కార్లు, 90 బైకులు కొలువు దీరి ఉన్నాయి. వీటిలో పురాతన కార్ల నుండి ఫాస్ట్‌గా వెళ్లే మోడ్రన్ సూపర్ కార్ల వరకూ అన్ని రకాల కార్లు ఉన్నాయి. కాగా... ఇందులో టాటా నానో కారు మాత్రం మిస్ అయింది. అందుకే.. ఇండియా నుండి ప్రత్యేకంగా ఓ టాటా నానో కారును ఆర్డర్ చేయించుకొని మరీ జే లెనో ఆ కారుకు తన గ్యారేజ్‌లో స్థానం కల్పించాడు.
దీని గురించి మీడియాకు తెలియజేసే సందర్భంగా, జే లెనో పూర్తిగా భారతీయం సాంప్రదాయం ఉట్టిపడేలా దుస్తులు ధరించి వెనుక వైపు ఓ భారత జెండాను ఉంచి, రెండు చేతులతో నమస్కరిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. జే లెనో దిగుమతి చేసుకున్న ఈ తెలుపు రంగు నానో కారుపై మువ్వన్నెల పెయింటిగ్‌ను కూడా గమనించవచ్చు. జే లెనో కార్ కలెక్షన్‌ను అతని వెబ్‌సైట్ jaylenosgarage.com లో చూడవచ్చు.


Click it and Unblock the Notifications









