సరికొత్త టాటా నానోను తీసుకువస్తాం: రతన్ టాటా
టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు 'టాటా నానో' ఇకపై మరింత మెరుగైన డిజైన్‌తో, సరికొత్త హంగులతో లభ్యం కానుంది. ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారుగా తాము ప్రవేశపెట్టిన టాటా నానో కారును రీడిజైన్ చేయాలని యోచిస్తున్నామని టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కొత్త డిజైన్‌తో కూడిన సరికొత్త నానో కారును విడుదల చేయటం ద్వారా ఈ మోడల్ అమ్మకాలను పెంచుకోవాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన అన్నారు.
నానో కారును సరైన రీతిలో మార్కెటింగ్ చేయడంలో తాము విఫలమైనట్లు టాటా చెప్పారు. రతన్ టాటా తొలుత లక్ష రూపాయలకే నానో కారును అందించాలనుకున్నప్పటికీ, ఆ తర్వాత సంభవించిన పలు కారణాల వలన దీని ధర లక్షా యాభై వేలకు పెరిగింది. అప్పట్లో మొదటి లక్ష మంది కొనుగోలుదారులు మాత్రమే ఈ కారును లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నారు. టాటా నానో కారు 2009లో భారత మార్కెట్లో విడుదలైంది. టాటా మోటార్స్ ఆశించిన రీతిలో ఈ చిన్న కారు అమ్మకాలు సాగటం లేదు.

బెంగాల్‌లోని టాటా నానో ప్లాంట్ వద్ద చెలరేగిన అల్లర్ల కారణంగా సదరు ప్లాంటును అక్కడి నుంచి గుజరాత్‌కు మార్చడం, నానో కారు విడుదలలో జాప్యం జరగటం, తొలినాళ్లలో సరైన మార్కెటింగ్ విధానాలు పాటించకపోవటం, డీలర్‌షిప్ నెట్‌వర్క్ తక్కువగా ఉండటం, కొనుగోలుదారులు కోరుకున్న రీతిలో టాటా నానో కారు ఉండకపోవటం వంటి అనేక కారణాల వలన టాటా నానో కారు పెద్దగా సక్సెస్‌ను సాధించలేక పోయింది. ఈ నేపథ్యంలో కొత్తగా రానున్న సరికొత్త టాటా నానో అయినా టాటా మోటార్స్‌కు ఈ సెగ్మెంట్లో సక్సెస్‌ను తెచ్చిపెడుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. టాటా గ్రూప్ నుండి రతన్ టాటా ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్‌కు రతన్ టాటా వారసుడిగా సైరస్ మిస్త్రీని నియమిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నియామకం డిసెంబర్ 28, 2012 నుంచి అమల్లోకి రానుంది.


Click it and Unblock the Notifications








