వేలానికి ప్రపంచపు పురాతన ఫోర్డ్ కారు
ఈ ఫోటోలో కనిపిస్తున్న కారును చూశారా..? ఈ కారుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత పురాతన ఫోర్డ్ కారు. 'ఛాస్సిస్ 30' (షాషీ 30)గా పిలిచే ఈ ఫోర్డ్ కారు ప్రస్తుతం వేలానికి వచ్చింది. ఫోర్డ్ ఛాస్సిస్ 30 కారును 1903లో అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ రూపొందించింది. దాదాపు 109 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన ఫోర్డ్ కారును త్వరలో అమెరికాలో వేలం వేయనున్నారు.
ఫోర్డ్ ఛాస్సిస్ 30 ఇప్పటి వరకూ కేవలం ఐదు చేతులు మాత్రమే మారింది. 2007 సంవత్సరంలో ఈ కారును రిస్టోర్ చేశారు. శతాబ్ధానికి పైగా వయస్సు కలిగిన ఈ కారు ఇప్పటికీ మంచి రన్నింగ్ కండిషన్‌లో ఉండి సాధారణ రోడ్లపై నడిపేందుకు వీలుగా ఉంటుంది. ఫోర్డ్ సంస్థ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్ ఆధ్వర్యంలో ఈ కారును డిజైన్ చేయటం జరిగింది.
ప్రముఖ వేలం కంపెనీ 'ఆర్ఎమ్ ఆక్షన్స్' ఈ ఫోర్డ్ ఛాస్సిస్ 30కు వేలం నిర్వహించనుంది. వేలంలో ఈ కారు వెల 30 లక్షల అమెరికన్ డాలర్ల నుంచి 50 లక్షల అమెరికన్ డాలర్లు పలకవచ్చని అంచనా. అక్టోబర్ 11న పెనుస్లేవియాలో ఈ కారును వేలం వేయనున్నారు. ఫోర్డ్ సంస్థ ప్రారంభించిన తర్వాత, తొలి సంవత్సరంలో నిర్మించిన 1750 మోడళ్లలో ఇది కూడా ఒకటి. ఇలాంటి మొత్తం మూడు కార్లు మాత్రమే తయారు చేయగా, వాటిలో ఈ కారు మాత్రమే సురక్షితంగా ఉంది.
ఫోర్డ్ ఛాస్సిస్ 30లో 1688సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 8 బిహెచ్‌పిల శక్తిని మాత్రమే విడుదల చేస్తుంది. అంటే ఈ పవర్ ఓ సాధారణ స్కూటర్ పవర్‌తో సమానం. దీని గరిష్టం వేగం గంటకు 28 మైళ్లు మాత్రమే.


Click it and Unblock the Notifications









