2014 ఫియట్ లీనియా కన్ఫర్మ్.. ఆటో ఎక్స్‌పోలో విడుదల
ఇటాలియన్ కార్ కంపెనీ ఫియట్ గడచిన 8 ఏళ్ల క్రితం భారత మార్కెట్లో తమ లీనియా సెడాన్‌ను విడుదల చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మోడల్‌కు ఎలాంటి మేజర్ అప్‌డేట్స్‌ను కంపెనీ చేయలేదు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లకు ఫియట్ ఇప్పటికే ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లీనియా సెడాన్‌కు పరిచయం చేసింది. తాజా సమాచారం ప్రకారం, ఫియట్ ఇండియా వచ్చే ఏడాదిలో ఈ కొత్త లీనియా సెడాన్‌ను దేశీయ విపణిలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఫియట్ ఈ కొత్త లీనియా కారును ఆవిష్కరించనుంది. భారత మార్కెట్‌కు రానున్న కొత్త లీనియాకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు తెలియలేదు కానీ, అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతున్న కొత్త లీనియాలోని అనేక ఫీచర్లు ఇండియన్ వెర్షన్ లీనియాలోను ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా.. కొత్త ఫ్రంట్ డిజైన్, కొత్త గ్రిల్, రీడిజైన్ చేయబడిన బంపర్, ఎయిర్ డ్యామ్ మరియు ఫాగ్ ల్యాంప్ క్లస్టర్‌లను చూడొచ్చు.

అలాగే, వెనుక డిజైన్‌లో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉన్నాయి. లోవర్ బంపర్‌పై ఉన్న లైసెన్స్ ప్లేట్‌ను వెనుక బూట్ డోర్‌పైకి మార్చటాన్ని ఇందులో గమనించవచ్చు. ఎక్స్టీరియర్స్‌పై ఎక్కువ భాగం క్రోమ్ ఫినిషింగ్‍ను మనం చూడొచ్చు. ఇంటీరియర్ ఫీచర్స్ గురించి పూర్తి వివరాలు తెలియదు కానీ, ఇందులో మరింత ప్రీమియం ఫీల్‌ను అందించేలా కొత్త లీనియా ఇంటీరియర్స్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు సమాచారం. రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్ ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన మార్పు.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, భారత మార్కెట్లో ఫియట్ ప్రస్తుత లీనియా సెడాన్‌లోని కొన్ని ఫీచర్లను తొలగించి లీనియా క్లాసిక్ పేరుతో చవక ధరకే కొత్త 2014 లీనియాతో పాటుగా విక్రయించనున్నట్లు తెలుస్తోంది. రానున్న మూడేళ్లలో ఫియట్ 8 కొత్త మోడళ్లను భారత మార్కెట్‌కు పరిచయం చేయనుంది. అందులో జీప్ బ్రాండ్ మోడళ్లతో పాటుగా, అబార్త్ బ్రాండ్ హ్యాచ్‌బ్యాక్ కూడా ఉంది. ఆటోమొబైల్ రంగానికి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








