ఏప్రిల్ నుంచి కార్ల ధరలను పెంచనున్న హ్యుందాయ్
ఓవైపు కార్ల అమ్మకాలు తగ్గముఖం పడుతున్నప్పటికీ, కార్ కంపెనీలు మాత్రం ధరలు పెంచేందుకు మొగ్గు చూపుతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి తమ ఉత్పత్తుల ధరలు పెంచనున్నామని హోండా ఇప్పటికే ప్రకటించగా, తాజాగా హ్యుందాయ్ కూడా ఇదే కోవలో ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలను పెంచుతామని ప్రకటించింది.
ఓబిడిసి (ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ కంప్లయన్స్) మార్పుల వల్ల పెరిగిన ఖర్చులను తట్టుకునేందుకు ధరలు పెంచక తప్పడం లేదని కార్ కంపెనీలు పేర్కొంటున్నాయి. దేశపు అగ్రగామి కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా కూడా ఉత్పత్తుల ధరలను పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. గడచిన జనవరి నెలలో అనేక కార్ కంపెనీలు పెరిగిన ఇన్‌పుట్ ధరలు, కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా ఉత్పత్తుల ధరలను పెంచాయి.
తాజాగా, కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన యూనియన్ బడ్జెట్‌లో ఎస్‌యూవీలపై ఎక్సైజ్ సుంకాన్ని, ఇంపోర్టెడ్ కార్లు, మోటార్‌సైకిళ్లపై దిగుమతి సుంకాలను పెంచడంతో వచ్చే నెల నుంచి ప్యాసింజర్ కార్లతో పాటుగా ప్రీమియం కార్లు కూడా మరింత ప్రియంగా మారనున్నాయి. కాగా.. హ్యుందాయ్ తమ ఉత్పత్తులపై ఎంత మేర ధరలు పెంచనున్నామనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. హోండా, హ్యుందాయ్ బాటలోనే మరిన్ని కార్ కంపెనీలు ఏప్రిల్ నుంచి తమ ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications








