స్కూలు పిల్లలకు నానో కార్లను బహుమతి: అఖిలేష్ యాదవ్
స్కూలు పిల్లలకు టాబ్లెట్ పిసిలు, సైకిళ్లను బహుమతిగా ఇవ్వటం విన్నాం కానీ, ఎక్కడైనా కార్లను బహుమతిగా ఇవ్వటం చూశారా? ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకొని ముఖ్యాంశాల్లో నిలుస్తుండే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ గతంలో తన క్యాబినెట్‌లో ఏ ఎమ్ఎల్యే వద్ద అయితే కారు లేదో, అలాంటి వారు రాష్ట్రానికి కేటాయించిన నిధులను ఉపయోగించి కారును కొనుక్కోమని ఓ ప్రతిపాదన చేసి వివాదాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా, అసలు లైసెన్సుకు సైతం అర్హత పొందడానికి వీలులేని పాఠశాల విద్యార్థులకు టాటా నానో కారును బహుమతిగా ఆఫర్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.
గడచిన శనివారం నేషనల్ స్కూల్ గేమ్స్ ముగింపు సందర్భంగా, అందులో పాల్గొన్న పది అత్యుత్తమ క్రీడాకారులకు అఖిలేష్ యాదవ్ సరికొత్త టాటా నానో కార్లను బహుమతిగా అందజేశారు. నాసిక్‌కు చెందిన మిడిల్ డిస్టన్స్ రన్నర్ అంజన అంర్-17 క్యాటగిరీలో 3 స్వర్ణ పతకాలను సాధించి టాటా నానో కారును సొంతం చేసుకుంది. ఆమెకు కారు డ్రైవ్ చేయటం రాదు కాబట్టి, ఆమె కోచ్ విజేందర్ నానో కారులో విజేతను ట్రాక్ చుట్టూ రైడ్‌కు తీసుకువెళ్లాడు. ఇకపై ఈ పిల్లకు ఆటలతో పాటుగా డ్రైవింగ్‌ను కూడా నేర్పాల్సి ఉంటుందని కోచ్ విజేందర్ చమత్కరించారు.
ఈ గేమ్స్‌లో సుమారు 2600 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క సైకిల్‌ను బహుకరించారు. ఏదేమైనప్పటికీ, అఖిలేశ్ యాదవ్ చేసిన ఈ పనిని కొందరు మెచ్చుకుంటుండగా, మరికొందరు సైకిల్ కూడా తొక్కడం రాని వాళ్లకు కారును బహుమతిగా ఇవ్వటమేంటని విమర్శిస్తున్నారు. మీరేమంటారు..?



Click it and Unblock the Notifications








