ఉత్పత్తుల ధరలను 4 శాతం మేర పెంచిన ఆడి ఇండియా
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ఉత్పత్తుల ధరలను 4 శాతం మేర పెంచుతున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. పెరిగిన ధరలు జులై 15, 2013వ తేది నుంచి అమల్లోకి వస్తాయని ఆడి ఇండియా తెలిపింది.
ప్రస్తుత మార్కెట్ పరిస్థతి పెను సవాలుగా మారిందని, డాలరుతో పోల్చుకుంటే బలహీనపడుతున్న రూపాయి మారకపు విలువ కారణంగా ఇన్‌పుట్ వ్యయం పెరుగుతున్నందు వలన భారత్‌లో తమ ఉత్పత్తుల ధరల విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఏర్పడిందని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు.
ఉత్పత్తుల ధరలను పెంచినప్పటికీ, తమ కొనుగోలుదారుల కోసం ఆడి ఫైనాన్స్ ద్వారా ఆకర్షనీయమైన ఫైనాన్స్ సేవలను అందిస్తున్నామని ఆయన చెప్పారు. తాజా పెంపుతో ఆడి క్యూ5 ధర రూ.1,52,000, ఆడి ఏ6 ధర రూ.1,80,000 మరియు ఆడి ఆర్8 ధరలు 4,42,000 మేర పెరిగాయి.
సవాళ్లతో కూడిన మార్కెట్ వాతావరణంలో ఆడి ఇండియా ప్రోత్సాహకర వృద్ధిని కనబరుస్తుందని, తమ ప్రగతిని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది తమ అమ్మకాల లక్ష్యాన్ని సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ దేశవ్యాప్తంగా 26 డీలర్‌షిప్ కేంద్రాలు ఉండగా, 2013 చివరి నాటికి వీటి సంఖ్యను 34కు పెంచనున్నట్లు ఆయన తెలిపారు.



Click it and Unblock the Notifications








