ఆడి నెంబర్ వన్ సెలబ్రేషన్స్; కార్లపై రూ.3 లక్షల బెనిఫిట్స్
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా ఇటీవలే భారత లగ్జరీ కార్ మార్కెట్లో అగ్ర స్థానంలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఇండియాను ఓవర్‍టేక్ చేసి నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసినదే. భారత లగ్జరీ కార్ మార్కెట్లో నెంబర్ వన్‌గా నిలవాలన్న కల నెరవేరడంతో ఆడి ఇండియా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తమ కొనుగోలుదారులకు కంపెనీ భారీ ప్రోత్సాకాలను ఆఫర్ చేస్తుంది.
కొత్త ఆడి కారును కొనుగోలు చేసే వారికి ఆడి ఇండియా రూ.3 లక్షల విలువైన బెనిఫిట్లను ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ కేవలం ప్రస్తుత ఆడి వినియోగదారలకు మాత్రమేనంటూ కంపెనీ ఓ మెలిక పెట్టింది. నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడానికి తమ కస్టమర్లే కారణమని, అందుకే తమ ప్రస్తుత ఆడి వినియోగాదారులకు ఈ ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తున్నామని కంపెనీ తెలిపింది.
ఈ ఆఫర్‌లో భాగంగా, ప్రస్తుతం ఆడి కార్లను కలిగి కస్టమర్లు తమ పాత ఆడి కారును ఎక్సేంజ్ చేసుకొని, కొత్త ఆడి కారును కొనుగోలు చేయాలనుకునే వారికి లేదా మరొక కొత్త ఆడి కారును కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ రూ.3 లక్షల విలువైన బెనిఫిట్లను ఆఫర్ చేస్తుంది.

గడచిన ఆర్థిక సంవత్సరం (2012-13)లో ఆడి ఇండియా తమ అమ్మకాల లక్ష్యాన్ని (8,000 యూనిట్లు) బ్రేక్ చేసి ఏకంగా 9,350 యూనిట్లను విక్రయించి ప్రథమ స్థానాన్ని చేజిక్కించుకోగా, ఇదే సమయంలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా కేవలం 8,416 యూనిట్లను మాత్రమే విక్రయించి ద్వితీయ స్థానానికి దిగజారిపోయింది. ఇకపోతే మెర్సిడెస్ బెంజ్ మాత్రం 7,239 యూనిట్లను విక్రయించి తృతీయ స్థానంలో కొనసాగుతుంది.


Click it and Unblock the Notifications








