మేలో ప్రోత్సాహకర అమ్మకాలు నమోదు చేసిన ఆడి ఇండియా
భారత లగ్జరీ మార్కెట్లో ఇటీవలే ప్రథమ స్థానాన్ని ఆక్రమించుకున్న జపనీస్ లగ్జరీ కార్ కంపెనీ ఆడి ఇండియా ఇప్పుడు తన స్థానాన్ని పదిలంగా కాపాడుకునేందుకు సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. మే 2013 నెలలో ఆడి ఇండియా మొత్తం 710 లగ్జరీ కార్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే ఇది ఏకంగా 57.24 శాతం అధికం. మే 2012 నెలలో కంపెనీ మొత్తం అమ్మకాలు కేవలం 451 యూనిట్లుగా మాత్రమే ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ ఏడాది జనవరి నుంచి మే 2013 వరకూ ఆడి ఇండియా మొత్తం 4,096 కార్లను విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోల్చుకుంటే ఇది 24.8 శాతం ఎక్కువ. 2012లో జనవరి నుంచి మే వరకూ కంపెనీ కేవలం 3,282 కార్లను మాత్రమే విక్రయించగలిగింది.
2013 సంవత్సరం తమకు ఎంతో గొప్పదని, ఏ నెలకు ఆ నెల తాము వృద్ధిని సాధించడమే కాకుండా, భారత లగ్జరీ కార్ సెగ్మెంట్లో నాయకత్వ స్థానాన్ని కూడా తాము సంపాధించుకోగలిగామని ఆడి ఇండియా హెడ్ మైఖేల్ ప్రెస్కీ తెలిపారు. ఈ నాయకత్వ స్థానాన్ని నిలబెట్టుకోవటం ఎంతో ముఖ్యమని, ఈ ఏడాది చివరి నాటికి 10,800 కార్లను (20 శాతానికి పైగా వృద్ధి) విక్రయించాలన్న తమ కంపెనీ అమ్మకాల లక్ష్యాన్ని సాధించగలని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా కొనుగోలుదారులకు మరింత చేరువయ్యేందుకు ఆడి ఇండియా తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరిస్తోంది. కంపెనీ ఇటీవలే భువనేశ్వర్‌లో ఓ ప్రపంచ స్థాయి షోరూమ్‌ను ప్రారంభించింది. దీంతో భారత్‌లో ఆడి ఇండియా షోరూమ్‌ల సంఖ్య 26కు చేరుకుంది. ఈ ఏడాది చివరి నాటికి తమ డీలర్‌షిప్‌ల సంఖ్యను 34కు పెంచుకోవాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది. పూనే, గోవాలలో విజయవంతమైన తమ ఆడి స్పోర్ట్స్ కార్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇప్పుడు భువనేశ్వర్, ఢిల్లీ ప్రాంతాలకు పరిచయం చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








