కొనుగోలుదారులకు షాక్: ప్రియం కానున్న వాహన రుణాలు

ఆర్‌బిఐ తీసుకున్న చర్యతో వడ్డీ రేట్లు పెరిగి, వాహన రుణాలు మరింత ప్రియంగా మారుతాయని ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పండుగ సీజన్‌లోనైనా అమ్మకాలు కాస్తంత పుంజుకుంటాయని ఆశిస్తే, ఆర్‌బిఐ తమ ఆశలపై నీళ్లు చల్లిందని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితులు కొనుగోలుదారుల సెంటిమెంటును మరింత దెబ్బ తీస్తాయని తెలిపింది.
పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించేలా ఆర్‌బీఐ చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని సియామ్ అభిప్రాయపడింది. కాగా.. ఇదే అంశంపై జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ వ్యాఖ్యానిస్తూ, ఇది పండుగ సీజన్‌లో వాహనరంగానికి ఊహించని ఎదురుదెబ్బ అని అన్నారు. రుతుపవనాలు బాగుండటంతో ఈ సీజన్‌లో అమ్మకాలు కొంతైనా మెరుగుపడతాయని ఆశించామని, ఇప్పుడు ఇది సాధ్యపడేలా కనిపించడం లేదని అన్నారు. టొయోటా కిర్లోస్కర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సింగ్ ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications








