ఆటో రంగానికి ప్రత్యేక ప్యాకేజీ కావాలి: ప్రఫుల్ పటేల్
వరుసగా గడచిన తొమ్మిది నెలలుగా కార్ల అమ్మకాలు తగ్గముఖం పట్టిన సంగతి తెలిసినదే. ఈ పరిస్థితులు ఆటోమొబైల్ పరిశ్రకు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ మందగమనం ఇలానే కొనసాగితే, ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలో, ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ అవసరమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ మరోసారి వ్యాఖ్యానించారు.
వాహన అమ్మకాల తగ్గుదల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత 9 నెలలుగా వాహనా అమ్మకాలు తగ్గుతున్నాయని, ఫలితంగా ఉద్యోగాలు పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొత్త ఉద్యోగాలివ్వాల్సిన ఈ తరుణంతో ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని, ఈ విషయాలన్నింటినీ ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లామని ప్రఫుల్ పటేల్ వివరించారు.

భారీగా పెరిగిపోతున్న కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) విషయంలో భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఆందోళన చెందుతోందని అన్నారు. ఏదేమైనప్పటికీ, ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకునేందుకు ఏ రూపంలో అయినా సరే ఎంతో కొంత ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలని పటేల్ కోరారు. తయారీరంగ జీడీపీలో వాహన రంగం వాటా 25 శాతంగా ఉంది. భారీగా ఉద్యోగాలు కల్పిస్తోన్న రంగాల్లో ఆటోమొబైల్ రంగం కూడా ఒకటని, భారత్‌లో ఆహార భద్రత ఎంత అవసరమో, వాహన రంగ వృద్ధి కూడా అంతే అవసరమని ఆయన చెప్పారు.
జులైలోను క్షీణించిన అమ్మకాలు
ఆర్థిక మందగమనం, వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉండడంతో గడచిన నెలలో కార్ల అమ్మకాలు 7.4 శాతం తగ్గాయి. జులై 2013లో అన్ని విభాలకు చెందిన వాహనాల అమ్మకాలు 14,45,112 యూనిట్ల నుంచి 14,15,102 యూనిట్లకు తగ్గి 2.08 శాతం క్షీణతను నమోదు చేశాయి.
సియామ్ డిమాండ్
గతంలో సియామ్ (భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం) కూడా ఆటోమొబైల్ రంగాన్ని ఆదుకోవడానికి ప్యాకేజీ కావాలని ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసినదే. 2008 నాటి సంక్షోభ సమయంలో ఇచ్చిన తరహా ప్యాకేజీని ఇవ్వాలని సియాం సూచిస్తోంది. అప్పుడు చిన్న కార్లు, టూవీలర్లు, వాణిజ్య వాహనాలపై ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని 8 శాతానికి తగ్గించింది.


Click it and Unblock the Notifications








