ఆర్ఈ కాంపాక్ట్ త్రీవీలర్లను విడుదల చేసిన బజాజ్ ఆటో
ప్రపంచంలో కెల్లా అతిపెద్ద త్రిచక్ర వాహనాల (ఆటోరిక్షా) తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్, నేడు సరికొత్త ఆటోరిక్షాలను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆర్ఈ సిరీస్‌లో పెట్రోల్‌తో నడిచే కాంపాక్ట్ ఆటోరిక్షాలను బజాజ్ ప్రవేశపెట్టింది. డీజిల్ ఇంధనంతో నడిచే బజాజ్ ఆర్ఈ కాంపాక్ట్ ఆటోరిక్షాలను త్వరలోనే ప్రవేశపెడతామని ఈ సందర్భంగా కంపెనీ పేర్కొంది.
బజాజ్ తాజాగా విడుదల చేసిన ఈ ఆర్ఈ కాంపాక్ట్ ఆటోరిక్షాలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్యాసింజర్ వాహనాల కన్నా అనేక రెట్లు మెరుగైనవి. ఇందులో 4-స్ట్రోక్ డిటిఎస్ఐ ఇంజన్‌ను ఉపయోగించారు. స్టయిలిష్ ఫ్రంట్ లుక్, సులువైన సర్వీసింగ్ మరియు రిపేర్ టెక్నాలజీలు, సాటిలేని పెర్ఫామెన్స్, తిరుగులేని మైలేజ్, ధృఢమైన నిర్మాణం వంటి కొత్త శ్రేణి ఫీచర్లతో ఈ కాంపాక్ట్ ఆటోరిక్షాను అభివృద్ధి చేశామని కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతం బజాజ్ ఆటో అందిస్తున్న త్రిచక్ర వాహనాల కన్నా ఇవి 10-15 శాతం ఎక్కువ మైలేజీని ఆఫర్ చేస్తాయని, తక్కువ మెయింటినెన్స్ ఖర్చుతో ఎక్కువ రాబడి అందిస్తాయని బజాజ్ ఆటో తెలిపింది. ఈ కొత్త ఆటోరిక్షాలను దేశవ్యాప్తంగా దశలవారీగా విడుదల చేయనున్నారు. దీని ధర ఇతర వివరాలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం బజాజ్ ఆటోకు చిన్న సైజ్ ఆటోరిక్షా విభాగంలో దాదాపు 85 శాతం మార్కెట్ వాటా ఉంది.



Click it and Unblock the Notifications








