పండుగ ఆఫర్స్: కార్ లోన్లపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు
ప్రస్తుత పండుగ సీజన్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఓ వైపు ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తుంటే, మరోవైపు రుణగ్రస్తులను ఆకట్టుకునేందుకు వివిధ బ్యాంకులు కార్ లోన్ వడ్డీ రేట్లపై తగ్గింపులను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా, భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) వాహన రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది.
పండుగ సీజన్‌లో రుణ డిమాండ్‌ను ఆకర్షించడంలో భాగంగా ఎస్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఐఓబి (ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్) , దేనా బ్యాంకులు కూడా ఇదే బాటలో రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి. అలాగే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి), ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబిసి), ఐడిబిఐ బ్యాంక్‌లు కూడా ఆటోమొబైల్స్‌పై ప్రత్యేక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి.

ఎస్‌బిఐ కార్ లోన్:
ఎస్‌బిఐ కార్ లోన్ వడ్డీ రేట్ల తగ్గింపు విషయానికి వస్తే, వాహన రుణాలపై వడ్డీ రేటు 0.20 శాతం మేర తగ్గింది. తాజా తగ్గింపుతో వాహన రుణాలపై ఎస్‌బిఐ అందిస్తున్న వడ్డీ రేటు సాలీనా 10.55 శాతానికి తగ్గింది. అలాగే ప్రాసెసింగ్ ఫీజును కూడా రుణ మొత్తంలో 0.51 శాతం తగ్గించింది. అంటే, ఇప్పుడు కనీస ప్రాసెసింగ్ ఫీజు రూ.1,020 నుంచి రూ.500 ఫ్లాట్ రేట్‌కు తగ్గుతుందన్నమాట. ఈ ఆఫర్ అక్టోబర్ 7వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి వరకూ అమల్లో ఉంటుందని ఎస్‌బిఐ ప్రకటించింది. వేతన జీవులు కొనుగోలు చేసే ద్విచక్ర వాహనాలపై వడ్డీ రేట్లు 12.05 శాతం నుంచి ప్రారంభమవుతాయి.
పిఎన్‌బి కార్ లోన్:
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కార్ లోన్లను 10.65 శాతం వడ్డీ రేటకు, ద్విచక్ర వాహన రుణాలను 12.25 శాతంవడ్డీ రేటుకు ఆఫర్ చేస్తోంది. కారు రుణాలపై ఎలాంటి డాక్యుమెంటేషన్ చార్జీలు వసూలు చేయబోమని, ఎక్స్‌షోరూమ్ ధరపై 100 శాతం రుణాన్ని అందిస్తామని సదరు బ్యాంక్ పేర్కొంది. ఈ ఆఫర్లు వచ్చే ఏడాది జనవరి 31 వరకూ అందుబాటులో ఉంటాయని పిఎన్‌బి తెలిపింది.
ఓబిసి కార్ లోన్:
వాహన రుణాలపై వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గిస్తున్నట్లు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబిసి) పేర్కొంది. ఈ తగ్గింపు నేటి (గురువారం) నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంకు వివరించింది. కార్ లోన్‌పై వడ్డీ రేట్లను 12.25 నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నామని తెలిపింది. అలాగే కార్లు, టూ-వీలర్ల రుణాలకు సంబంధించి మూడేళ్లలో చెల్లించే రుణాలపై 10.75 శాతం, మూడేళ్లకు మించిన రుణాలపై 11 శాతం వడ్డీ రేట్లకే రుణాలను ఆఫర్ చేస్తున్నామని ఓబిసి వివరించింది.
ఐడిబిఐ కార్ లోన్:
వాహన రుణాలను కేవలం బేస్ రేటు (10.25 శాతం వడ్డీ రేటు)కే అందిస్తామని ఐడిబిఐ తెలిపింది. ఈ తగ్గింపు బుధవారం నుంచే వర్తిస్తుందని, ఈ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేయబోమని బ్యాంకు వివరించింది.


Click it and Unblock the Notifications








