'రూపాయి' దెబ్బకు పెరగనున్న కార్ల ధరలు

ఇప్పటికే టయోటా కిర్లోస్కర్ మోటార్స్, జనరల్ మోటార్స్ ఇండియా వంటి కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. కానీ, కార్ల ధరలను పెంచే విషయంలో మరికొంత సమయం వేచిచూస్తామని టయోటా కిర్లోస్కర్ మోటార్స్(టీకేఎమ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (మార్కెటింగ్) సందీప్ సింగ్ తెలిపారు. ఈ నెలాఖరున ధరలను సమీక్షిస్తామని, రూపాయి పతనం ఇలానే కొనసాగితే ధరలను పెంచక తప్పదని ఆయన అన్నారు.
ప్రస్తుతం టొయోటా తమ కార్లలో ఉపయోగించే విడిభాగాలలో దాదాపు 50 శాతం విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. రూపాయి విలువ పతనం వలన ఈ విడిభాగాల ధర కూడా భారీగా పెరుగుతుండటంతో కంపెనీ ఉత్పాదక వ్యయం కూడా పెరుగుతుంది. జనరల్ మోటార్స్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాము ఈనెల ఆరంభంలో కార్ల ధరలను పెంచామని, అందువలన ప్రస్తుతం మరోసారి ధరలను పెంచే యోచనలేదని జనరల్ మోటార్స్ వైస్‌ప్రెసిడెంట్ పి.బాలేంద్రన్ చెప్పారు.
హోండా కార్స్ ఇండియా(హెచ్‌సిఐఎల్) గడచిన ఏప్రిల్ నెలలో సిటీ, బ్రయో, అకార్డ్ ధరలను, జూన్ నెలలో అమేజ్, సిఆర్‌వి ధరలను పెంచిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, మరోసారి ధరల పెంచే విషయంలో, ప్రస్తుతం తాము వేచిచూసే ధోరణిలో ఉన్నామని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కూడా ధరలను పెంచే విషయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని పేర్కొంది. ఆటో రంగంలో కొనసాగుతున్న మందగమనం కారణంగా ప్రస్తుతం ధరలను పెంచే ఆలోచన లేదని హ్యూండయ్ తెలిపింది. మొత్తమ్మీద చూస్తే, రూపాయి పతనం ఇలానే కొనసాగితే కార్ల ధరలు మరింత ప్రియం కావటం ఖాయం.


Click it and Unblock the Notifications








