వరుసగా ఆరవ నెలలో కూడా తగ్గిన కార్ల అమ్మకాలు

వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉండడం, అధిక వడ్డీ రేట్లు, ఇతరత్రా అంశాలే ఈ అమ్మకాల తగ్గుదలకు కారణాలని సియామ్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ సుగతో సేన్ తెలిపారు. రానున్న రెండు నెలల వరకూ ఇలాంటి పరిస్థితే కొనసాగవచ్చని ఆయన అంచనా వేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో 1,68,354 వాహనాలు అమ్ముడవగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 10.43 శాతం క్షీణతతో 1,50,789 కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2002 తర్వాత ఈ స్థాయిలో అమ్మకాలు తగ్గడం ఇదే మొదటిసారి. 2002, ఏప్రిల్‌లో కార్ల అమ్మకాలు 23 శాతం తగ్గాయి.
ఎంట్రీ లెవల్ చిన్న కార్లు మార్కెట్లోకి వచ్చిన తర్వాత అమ్మకాలు పుంజుకోవచ్చని, మూడు-నాలుగు నెలల తర్వాత అమ్మకాల వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వాహన మార్కెట్‌ను మెరుగుపరచడానికి బడ్జెట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఏప్రిల్ నెలలో మారుతి సుజుకి అమ్మకాలు 5 శాతం పెరగగా, హ్యుందాయ్ అమ్మకాలు 8 శాతం, టాటా మోటార్స్ అమ్మకాలు 52 శాతం మేర తగ్గినట్లు సియామ్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇదే సమయంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా స్వల్పంగా తగ్గాయి.


Click it and Unblock the Notifications








