కాంపాక్ట్ ఎంజాయ్‌ను అభివృద్ధి చేస్తున్న చెవర్లే
అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ తాజాగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన బహుళ ప్రయోజన వాహనం (ఎమ్‌పివి) 'చెవర్లే ఎంజాయ్'లో కంపెనీ ఓ కాంపాక్ట్ వెర్షన్‍ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2013-14 యూనియన్ బడ్జెట్‌లో పెద్ద వాహనాలపై ఎక్సైజ్ సుంకాలను పెంచిన నేపథ్యంలో, ఎంజాయ్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఇందులో నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు ఉండేలా ఓ కాంపాక్ట్ వెర్షన్‌ను జనరల్ మోటార్స్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.
అంటే, మహీంద్రా జైలో మరియు మహీంద్రా క్వాంటో మాదిరిగానే ఈ చెవర్లే ఎంజాయ్ కూడా రెండు రూపాల్లో లభ్యం కానుందన్నమాట. కాంపాక్ట్ వెర్షన్ ఎంజాయ్‌ను మార్కెట్లోకి తీసుకురావటం ద్వారా ఈ మోడల్‌పై ఎక్సైజ్ రాయితీలను పొంది, చాలా తక్కువ ధరకే దీనిని అందిచాలని కంపెనీ యోచిస్తుంది. ఇది కూడా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో (1200సీసీ, 1500సీసీ) లభ్యమయ్యే ఆస్కారం ఉంది. చెవర్లే సెయిల్‌లో ఉపయోగించిన పెట్రోల్ ఇంజన్ (1.2 లీటర్, 85 బిహెచ్‌పి) ఈ కాంపాక్ట్ కారులో ఉపయోగించవచ్చని అంచనా.
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న చెవర్లే ఎంజాయ్ ఎమ్‌పివి 4305 మి.మీ. పొడవును కలిగి ఉంది. దీని పొడవును 305 మి.మీ. లకు పైగా తగ్గించి ఈ కాంపాక్ట్ ఎంజాయ్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అంటే, ఈ కాంపాక్ట్ కారులో చివరి వరుస (మూడవ వరుస) సీట్లు తొలగిపోయే ఆస్కారం ఉంది. దీని వలన ఈ కాంపాక్ట్ ఎంజాయ్ 7-సీటర్ ఎమ్‌పివితో పోల్చుకుంటే సుమారు 150 కేజీలకు పైగా తక్కువ బరువును కలిగి ఉంటుంది. ఫలితంగా ఇది మంచి పెర్ఫామెన్స్‌ను, మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తుంది.
ఈ కాంపాక్ట్ ఎంజాయ్ కారుకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.



Click it and Unblock the Notifications








