జనరల్ మోటార్స్ సంస్థకు తొలి మహిళా బాస్ 'మేరీ బరా'
నేటి మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసినదే. తాజాగా.. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద కార్ల తయారీ కంపెనీలలో ఒకటైన, అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ సంస్థకు తొలి మహిళా సీఈఓను నియమిస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తతం జనరల్ మోటార్స్ సంస్థకు చైర్మన్, సీఈఓగా వ్యవహరిస్తున్న డ్యాన్ అకెర్మన్ (65 ఏళ్లు) జనవరి 15, 2014వ తేదిన ఈ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో, డ్యాన్ అకెర్మన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు మేరీ బరాను నియమిస్తున్నామని కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం జనరల్ మోటార్స్ సంస్థలోని గ్లోబల్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, పర్చేసింగ్, సప్లయ్ చైన్ విభాగాలకు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న 51 ఏళ్ల ఇంజనీర్ మేరీ బరా, జనవరి 15, 2014 నుంచి సీఈఓ బాధ్యతలు చేపట్టనున్నారు.

జనరల్ మోటార్స్ కంపెనీ చరిత్రలో మేరీ బరా తొలి మహిళా సీఈఓ కావటం విశేషం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాపారంలో అత్యుత్తుమ బృందానికి నాయకత్వం వహించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ప్రస్తుతం చైర్మన్, సీఈఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్న 65 ఏళ్ల అకెర్సన్, తన సతీమణి తీవ్ర క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, పదవీవిరమణ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం కంపెనీ బోర్డ్ మెంబర్‌గా ఉన్న దిఅడోర్ (టిమ్) సోల్సో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.


Click it and Unblock the Notifications