టూవీలర్ ధరలను రూ.1500 మేర పెంచిన హీరో మోటోకార్ప్
భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ దేశీయ విపణిలో అందిస్తున్న అన్ని మోడళ్ల ధరలను మోడల్‌ను బట్టి రూ.500 నుంచి రూ.1,500 మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, రూపాయి విలువ పతనం తదితర అంశాల కారణంగా ధరలను పెంచాల్సి వచ్చిందని హీరో మోటోకార్ప్ ఓ ప్రకటనలో తెలిపింది.
పెరుగుతున్న ఖర్చులు, రుపాయి విలువ పతనం, విద్యుత్ ఛార్జీలు, రవాణా ఖర్చులు మొదలైన అంశాల నేపథ్యంలో తమ ఉత్పత్తుల ధరలను పెంచాలని నిర్ణయించామని కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు. పెరిగిన ధరలను ఈ నెల ఆరంభం నుంచే అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.

భారత మార్కెట్లో హీరో మోటోకార్ప్ తమ బడ్జెట్ బైక్ హెఫ్ డాన్ (ధర రూ.37,350) మొదలుకొని ప్రీమియం బైక్ కరిజ్మా జెడ్ఎమ్ఆర్ (ధర రూ.1,00,300) వరకు విభిన్న శ్రేణి బైక్‌లను అందిస్తోంది. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
గడచిన వారం బజాజ్ ఆటో కూడా మరికొద్ది రోజుల్లోనే తమ మోటార్‌సైకిళ్ల ధరలను మోడల్‌ను బట్టి రూ.500 నుంచి రూ.5,000 మేర పెంచనున్నామని పేర్కొన్న సంగతి తెలిసినదే. అధిక ఇన్‌పుట్ ఖర్చులు, బలహీన పడుతున్న రూపాయి విలువ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని త్వరలోనే ధరలను పెంచుతామని బజాజ్ ఆటో ప్రకటించింది. అయితే, ఈ పెంపు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








