రూ.4 లక్షల కన్నా తక్కువ ధరకే కాంపాక్ట్ అంబాసిడర్
భారతదేశపు అత్యంత పురాతన కార్ల తయారీ సంస్థ హిందూస్థాన్ మోటార్స్ వచ్చే ఏడాదిలో ఓ చిన్న అంబాసిడర్ కారును విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్ స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ కాంపాక్ట్ అంబాసిడర్‌ను రూ.4 లక్షల కంటే తక్కవ ధరకే అందించాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం హిందూస్థాన్ మోటార్స్ దేశీయ విపణిలో అందిస్తున్న రెగ్యులర్ వెర్షన్ అంబాసిడర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని మార్కెట్లో రానున్న ఈ కాంపాక్ట్ అంబాసిడర్ పొడవును 4 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా డిజైన్ చేయటం ద్వారా ఎక్సైజ్ సుంకపు రాయితీలను పొంది సరసమైన ధరకే ఈ కారును అందించాలని కంపెనీ యోచిస్తోంది. 2014 ద్వితీయ త్రైమాసికం నాటికి ఇది దేశీయ విపణిలో అందుబాటులోకి రావచ్చని అంచనా.

సికె బిర్లా గ్రూపుకు చెందిన హిందుస్థాన్ మోటార్స్ కంపెనీకు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ఉత్తర్‌పురా ఫ్యాక్టరీలోనే ఈ కాంపాక్ట్ వెర్షన్ అంబాసిడర్ కారును కూడా ఉత్పత్తి చేయనున్నారు. అలాగే ఈ కొత్త కారులో ఉపయోగించనున్న ఇంజన్‌ను కూడా రీట్యూన్ చేసి ఆధునిక కాలుష్య నిబంధనలు పాటించేలా తీర్చిదిద్దనున్నారు.
గతంలో ఒకానొక సందర్భంలో హిందుస్థాన్ మోటార్స్ ఎమ్‌డి, సీఈఓ ఉత్తమ్ బోస్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కాంపాక్ట్ అంబాసిడర్ కారు గురించి ప్రస్తావిస్తూ, ప్రస్తుతం ఆర్ అండ్ డి (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) పనులు జరుగుతున్నాయని, తమ అంబాసిడర్ హ్యాచ్‌బ్యాక్ డిజైన్ దశలో ఉందని, ఇది అన్ని రకాల ఫీచర్లతో నవతరం వినియోగదారులు కోరుకునేలా ఉంటుందని అన్నారు.


Click it and Unblock the Notifications








