ఆగస్టులో విడుదల కానున్న బిఎస్ 4 అంబాసిడర్ కారు
మెట్రో నగరాల్లో అంబాసిడర్ మళ్లీ సందడి చేయనుంది. ఆధునిక కాలుష్య నిబంధనల దృష్ట్యా 17 మెట్రో నగరాలకు దూరమైన అంబాసిడర్ సేవలు తిరిగి అందుబాటులోకి రానున్నాయి. బిఎస్4 (భారత్ స్టేజ్ 4) కాలుష్య నిబంధనలను పాటించే అధునాతన ఇంజన్‌తో కూడిన హిందూస్థాన్ మోటార్స్ అంబాసిడర్ వచ్చే నెలలో విడుదల కానుంది.
ఇదివరకటి అంబాసిడర్ కారులో బిఎస్3 (భారత్ స్టేజ్ 3) డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించే వారు. ఇది ప్రస్తుత కాలుష్య నిబంధలను పాటించకపోవటం, అధిక మోతాదులో కర్భన వ్యర్థాలను విడుదల చేస్తుండటంతో, కొన్ని మెట్రో నగరాల్లో ఏప్రిల్ 2010 నుంచి అంబాసిడర్ అమ్మకాలను నిలిపేశారు. అయితే, ఇప్పుడు తాజా అంబాసిడర్ ఆధునిక కాలుష్య నిబంధనలను పాటించే బిఎస్4 డీజిల్ ఇంజన్‌ను అభివృద్ధి చేసింది.

కొత్తగా మెట్రో నగరాల్లో ప్రవేశపెట్టనున్న అంబాసిడర్ కారులోను, అలాగే కంపెనీ అభివృద్ధి చేస్తున్న కాంపాక్ట్ అంబాసిడర్ కారులోను ఈ బిఎస్4 ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. బిఎస్4 వెర్షన్ అంబాసిడర్ ఆగస్ట్ నెలలో మార్కెట్లో విడుదల కానుంది. ఈ కొత్త రాకతో అంబాసిడర్ కారుకు మళ్లీ పూర్వవైభవం లభిస్తుందో లేదో వేచి చూడాలి.
కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, అంబాసిడర్ బిఎస్ వేరియంట్లో అప్‌గ్రేడెడ్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ సాంకేతిక వివరాలు తెలియాల్సి ఉంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) ఈ కొత్త ఇంజన్ గ్రీన్ సిగ్నల్ తెలిపింది. హిందుస్థాన్ మోటార్స్ హూగ్లీలోని తమ ఉత్తర్‌పురా ప్లాంటులో ఈ బిఎస్4 అంబాసిడర్ కారును ఉత్పత్తి చేయనుంది.


Click it and Unblock the Notifications








