రూ.8,000 వరకు పెరిగిన హోండా అమేజ్ ధర
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తాజాగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ మొట్టమొదటి డీజిల్ కారు హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ ధరను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. గడచిన ఏప్రిల్ నెలలో దేశీయ విపణిలోకి ప్రవేశించిన ఈ కాంపాక్ట్ సెడాన్ ఇప్పుడు వేరియంట్‌ను బట్టి రూ.3,000 నుంచి రూ.8,000 మేర ప్రియం కానుంది.
ఏప్రిల్ నెలలో హోండా కార్స్ ఇండియా కొన్ని మోడళ్ల ధరలను పెంచింది. కానీ అమేజ్, సిఆర్‌వి ధరలను మాత్రం పెంచలేదు. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి ఈ రెండు మోడళ్ల ధరలను కూడా పెంచుతున్నామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
గడచిన ఏప్రిల్ నెలలో సిటీ (రూ.3,000), బ్రయో (రూ.2,000-10,000) మరియు అకార్డ్ (రూ.5,000) మోడళ్ల ధరలను పెంచామని, ఇప్పుడు జూన్ 1వ తేది నుంచి అమేజ్ ధరలను రూ.3,000-8,000 రేంజ్‌లో అలాగే సిఆర్‌వి ధరలను రూ.6,000-14,000 రేంజ్‌లో పెంచుతున్నామని హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు.

ప్రస్తుతం హోండా అమేజ్ భారత మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడపోతుంది. ఒక్క మే నెలలో కంపెనీ మొత్తం 6,036 అమేజ్ సెడాన్లను విక్రయించింది. హోండా కార్స్ ఇండియా మొత్తం నెల అమ్మకాల్లో 53 శాతం అమ్మకాలు అమేజ్ ద్వారానే రావటం విశేషం. ఈ సమయంలో హోండా మొత్తం 11,342 యూనిట్లను విక్రయిస్తే అందులో 6,036 యూనిట్లు అమేజ్ కార్లే ఉన్నాయి. మరి తాజాగా అమేజ్ సెడాన్ ధరను పెంచడంతో అది ఈ మోడల్ అమ్మకాలపై ఏలాంటి ప్రభావాన్ని చూపుతుందో..?


Click it and Unblock the Notifications








