హోండా బ్రయో ఎమ్‌పివి ఆఫీషియల్ స్కెచ్ విడుదల
ఇదివరకటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నట్లుగానే, జపనీస్ కార్ కంపెనీ హోండా భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త ఎమ్‌పివి (మల్టీ పర్పస్ వెహికల్)ను తీసుకురానుంది. ప్రస్తుతం హోండా దేశీయ విపణిలో అందిస్తున్న బ్రయో ఉత్పత్తి ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ ఎమ్‌పివిని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో, హోండా తమ కొత్త కాంపాక్ట్ ఎమ్‌పివి అఫీషియల్ స్కెచ్‌ను విడుదల చేసింది.
భారత్, ఇండోనేషియా వంటి అభివృద్ధి చెందుతున్న ఆసియా మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని హోండా ఈ కాంపాక్ట్ ఎమ్‌పివిని రూపొందించింది. దీని ఉత్పత్తి వ్యయాన్ని తక్కువగా ఉంచి, సరమైన ధరకే ఈ మోడల్‌ను అందించేందుకు కంపెనీ బ్రయో ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకుంది. ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి ఎర్టిగా, చెవర్లే ఇంజాయ్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.

అఫీషియల్ స్కెచ్‌ను బట్టి గమనిస్తే, హోండా బ్రయో ఎమ్‌పివి విశిష్టమైన డిజైన్‌ను, విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉండనుంది. ఇది హై సేఫ్టీ స్టాండర్డ్ లతో 7-సీటర్ (3 వరుసలు, 2+3+2) ఆప్షన్‌తో లభ్యం కానుంది. ఇందులో అధిక మైలేజీనిచ్చే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఎర్త్‌డ్రీమ్స్ డీజిల్ ఇంజన్‌ను కూడా ఈ ఎమ్‌పివికి జోడించే ఆస్కారం ఉంది.
భారత్‌లో నెక్స్ట్ జనరేషన్ హోండా జాజ్ విడుదలైన తర్వాత 2014 ఆరంభంలో ఈ కొత్త ఎమ్‌పివి కూడా మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. రానున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో బ్రయో ఎమ్‌పివిని ఆవిష్కరించే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








