ఉత్తరాఖాండ్ బాధితులకు రూ.3 కోట్లు దానం చేసిన హోండా

ఈ మేరకు హోండా అధికారులు, ఉత్తరాఖాండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగణను కలిసి రూ.3 కోట్ల రూపాయల చెక్కును ఆయనకు అందజేశారు. హోండా దానం చేసిన మొత్తాన్ని హోండా గ్రూపులోని వివిధ సంస్థల నుంచి సేకరించారు. ఇందులో భారత్‌లోని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హోండా సియోల్ పవర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, హోండా ఆర్ అండ్ డి (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ మరియు హోండా మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఉన్నాయి.
వీటి నుండే కాకుండా హోండా ఉద్యోగులు, డీలర్లు కూడా వరద బాధితులను ఆదుకునేందుకు తమకు తోచిన సాయం చేశారు. గడచిన నెలలో మారుతి సుజుకి ఇండియా కూడా వరద బాధితుల కోసం ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసినదే. ఉత్తరాఖాండ్ బాధితులకు సత్వర వైద్య సేవలు అందించేందుకు గాను, మారుతి సుజుకి ఐదు అంబులెన్స్ వాహనాలను దానం చేసింది. అంతేకాకుండా, ఉద్యోగులందరూ తమ ఒక్క రోజు జీతాన్ని దానం చేశారు.
మారుతి సుజుకి ఇండియా సేకరించిన 1.56 కోట్ల రూపాయలను ప్రైమ్ మినిస్టర్ నేషల్ రిలీఫ్ ఫండ్‌కు అందజేసింది. కాగా.. ఇటీవల సంభవించిన ఉత్తరాఖాండ్ వరదల్లో 10,000 మందికి పైగా మృతి చెందినట్లు అంచనా వేస్తుండగా, 70,000 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. గల్లంతైన వారు సురక్షితంగా తమ ఆప్తులను కలుసుకోవాలని మనం కూడా ఆ భగవంతుడిని ప్రార్ధిద్దాం.


Click it and Unblock the Notifications








