అత్యధికంగా అమ్ముడుపోతున్న 2014 హోండా జాజ్
మరికొద్ది నెలల్లో భారత మార్కెట్లో విడుదల కానున్న కొత్త 2014 హోండా జాజ్, ఇప్పటికే జపాన్ మార్కెట్లో 'ఫిట్' (FIT) పేరుతో విడుదలై హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. స్వదేశీ (జపాన్) మార్కెట్లో హోండా ఫిట్ అమ్మకాలు అంచాలకు మించి సాగుతున్నాయి. హొండా యొక్క కొత్త 'ఎగ్జైటింగ్ హెచ్ డిజైన్'తో తయారు చేసిన ఈ 2014 జాజ్/ఫిట్ కారును సెప్టెంబర్ 5న జపాన్ మార్కెట్లో విడుదల చేశారు.
ఈ కారును జపాన్‌లో విడుదల చేసిన మొదటి నెలలోనే 62,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. ఇది హోండా ఊహించిన దాని కన్నా ఎన్నో రెట్లు అధికం. సెప్టెంబర్ నెలలో హోండా 19,388 యూనిట్ల ఫిట్ కార్లను డెలివరీ చేసింది. దీంతో ఇది సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్ల జాబితాలో 3వ కారుగా రికార్డు సృష్టించింది. 1వ కారు టొయోటా ఆక్వా (26,543 యూనిట్లు), 2వ కారుగా టొయోటా ప్రియస్ (23,069 యూనిట్లు) నిలిచింది.

కానీ అక్టోబర్ నెలలో మాత్రం ఈ రికార్డులు తారుమారు అయ్యాయి. గడచిన నెలలో మొత్తం 23,281 జాజ్/ఫిట్ కార్లను హోండా డెలివరీ చేసింది. ఇదే సమయంలో టొయోటా ఆక్వా (20,886 యూనిట్లు), టొయోటా ప్రియస్ (19,984 యూనిట్లు)గా ఉన్నాయి. టొయోటా ఆక్వాను ప్రియస్ సి అనికూడా పిలుస్తారు, ఇది ప్రియస్ హైబ్రిడ్‌కు కాంపాక్ట్ వెర్షన్.
ఈ అమ్మకాలను బట్టి చూస్తుంటే, జపాన్ ఆటో ప్రియులకు హైబ్రిడ్ కార్లంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. అంతేకాదు.. హోండా విక్రయించిన జాజ్ కార్లలో 70 శాతం టాప్ ఎండ్ వేరియంట్ అయిన జాజ్ ఎస్ హైబ్రిడ్ కార్లే కావటం విశేషం. హైబ్రిడ్ వెర్షన్ హోండా జాజ్ 1.5 లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్‌తో లభిస్తుంది. ఇవి రెండూ కలిసి లీటరుకు 36 కిలోమీటర్లకు పైగా మైలేజీనిస్తాయి.

ఈ కొత్త హోండా జాజ్ 2014లో మన దేశంలో విడుదల కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పో హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఈ కొత్త జాజ్ కారును ప్రదర్శించే అవకాసం ఉంది. అయితే, ఇండియన్ మార్కెట్లో హైబ్రిడ్ వెర్షన్‌ను విడుదల చేసే అంశం సందేహమే. కానీ ఇందులో పెట్రోల్ వెర్షన్ అలాగే డీజిల్ వెర్షన్ కూడా విడుదల కావచ్చని తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








