భారత్‌లో అకార్డ్ హైబ్రిడ్‌ను విడుదల చేయనున్న హోండా
ప్రస్తుత తరం హోండా అకార్డ్ లగ్జరీ సెడాన్‌ను మార్కెట్ నుంచి తొలగించి వేస్తున్నట్లు హోండా కార్స్ ఇండియా ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసినదే. అయితే, హోండా ప్రియులు చింతించాల్సిన అవసరం లేదు. ప్రస్తుత అకార్డ్‌ను తలదన్నేలా ఓ సరికొత్త తరం హోండా అకార్డ్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది.
వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల కానున్న నెక్స్ట్ జనరేషన్ హోండా అకార్డ్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో విడుదల కావటమే కాకుండా, హైబ్రిడ్ వేరియంట్లో కూడా అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే హోండా అకార్డ్ హైబ్రిడ్ గ్లోబల్ మార్కెట్లలో చక్కగా అమ్ముడుపోతూ, మంచి విజయాన్ని సాధించింది.

గతంలో హోండా కార్స్ ఇండియా తమ సివిక్ హైబ్రిడ్ కారును భారత మార్కెట్‌కు పరిచయం చేసినప్పటికీ, అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణంగా దాని అధిక ధరే. సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఈ మోడల్‌ను ఇండియాకు దిగుమతి చేసుకోవటం వలన, అధిక దిగుమతి సుంకాల కారణంగా దాని ధర కూడా అధికంగా ఉండేది.
ఈ నేపథ్యంలో, హోండా అకార్డ్ హైబ్రిడ్ విషయంలో కంపెనీ ఆచితూచి వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అకార్డ్ హైబ్రిడ్ కేవలం సింగిల్ వేరియంట్లో మాత్రమే విడుదల కావచ్చని సమాచారం. అంతేకాదు, దీని ధరను రూ.30 లక్షలకు మించకుండా అందించేందుకు హోండా కార్స్ ఇండియా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

హోండా అకార్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా ఎలక్ట్రిక్ పవర్‌తో నడుస్తుంది. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 141 పిఎస్‌ల శక్తిని, 165 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ లిథియం అయాన్ బ్యాటరీల సాయంతో నడుస్తుంది. ఈ రెండు ఇంజన్లు ఈ-సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు అనుసంధానం చేయబడి ఉంటాయి. ఇది ఈ సెగ్మెంట్లో నేరుగా టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ కారుతో పోటీ పడనుంది.


Click it and Unblock the Notifications








