హోండా కాంపాక్ట్ ఎస్‌యూవీ పేరు సిఆర్-యూ; 2014లో విడుదల
ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానో వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ధీటుగా జపనీస్ ఆటో దిగ్గజం హోండా ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఇప్పటికే హోండా ఈ ఏడాది ఆరంభంలో జరిగిన డెట్రాయిట్ మోటార్ షోలో ఓ అర్బన్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను కూడా ఆవిష్కరించడాన్ని మనం చూశాం.
తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ అర్బన్ ఎస్‌యూవీ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని హోండా తయారు చేస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం 'సిఆర్-యూ' (CR-U) అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. హోండా ఇప్పటికే 'సిఆర్-వి' (CR-V) పేరుతో ఓ ఫుల్ సైజ్ రెగ్యులర్ ఎస్‌యూవీ ఆఫర్ చేస్తున్న విషయం తెలిసినదే. కాగా.. కొత్తగా రానున్న ఈ సిఆర్-యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ, ప్రస్తుత సిఆర్-వి ఎస్‌యూవీ కన్నా తక్కువ పొడవును కలిగి ఉండనుంది.

కొత్త హోండా సిఆర్-యూ కాంపాక్ట్ ఎస్‌యూవీని మెరుగైన మైలేజీనిచ్చే వాహనంలా తీర్చిదిద్దనున్నారు. ఇటు సిటీ రైడ్‌కు అటు ఆఫ్-రోడింగ్‌కు అనువుగా ఉండేలా దీని నిర్మాణం ఉండనుంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, త్వరలో భారత మార్కెట్లో విడుదల కానున్న నెక్స్ట్ జనరేషన్ హోండా ఫిట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగానే ఈ కొత్త హోండా సిఆర్-యూ కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇది 2014లో భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. హోండా సిఆర్-యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇటు పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా అటు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో కూడా లభ్యం కానున్నట్లు సమాచారం. హోండా ఎర్త్‌డ్రీమ్స్ డీజిల్ ఇంజన్‌ను ఇందులో ఉపయోగించే అవకాశం ఉంది. తాజా వివరాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








