అమేజ్ వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు ఉత్పత్తి పెంపు
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ విపణిలో అందిస్తున్న లేటెస్ట్ మోడల్ 'హోండా అమేజ్' హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న సంగతి తెలిసినదే. ఇది హోండా నుంచి లభిస్తున్న చవక సెడాన్ మరియు మొట్టమొదటి డీజిల్ కారు కావటంతో ఈ కాంపాక్ట్ సెడాన్‌కు ఉత్పత్తికి మించి డిమాండ్ లభిస్తోంది. దీంతో హోండా అమేజ్ వెయింటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో, హోండా అమేజ్ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు గాను, కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా, కంపెనీ తమ గ్రేటర్ నోయిడా ప్లాంటులో మూడవ షిఫ్టును ప్రారంభించి, హోండా అమేజ్ ఉత్పత్తిని పెంచనుంది. ఈ ఉత్పత్తి పెంపు వలన హోండా అమేజ్ సెడాన్ వెయిటింగ్ పీరియడ్ భారీగా తగ్గనుంది.
ప్రస్తుతం హోండా అమేజ్ సెడాన్‌కు వేరియంట్‌ను బట్టి 4-5 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది. ఉత్పత్తి పెంపు ద్వారా ఇది 2 నెలలకు దిగొచ్చే ఆస్కారం ఉంది. ఉత్పత్తి పెంపు విషయంపై హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ మాట్లాడుతూ.. అమేజ్‌కు గట్టి డిమాండ్ ఉందని, రానున్న రోజుల్లో కూడా ఈ బుకింగ్‌లు ఇలానే కొనసాగుతాయని అన్నారు. వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు గాను నవంబర్ నాటికి గ్రేటర్ నోయిడాలో మూడవ షిఫ్టు ఉత్పత్తిని ప్రారంభించనున్నామని చెప్పారు.



Click it and Unblock the Notifications








