హ్యుందాయ్ యాక్సెంట్ ఖేల్ ఖతమ్, దుకాణం బంద్!
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ హ్యుందాయ్ యాక్సెంట్ (Hyundai Accent) ఇకపై చరిత్రలో కలిసిపోనుంది. భారత్‌లో ఈ కారు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం హ్యుందాయ్ యాక్సెంట్ ఎగ్జిక్యూటివ్ కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది.
ఇందులో ఉపయోగించిన 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 5500 ఆర్‌పిఎమ్ వద్ద 95 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 12.7 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కేవలం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుండటం, ఇందులో డీజిల్ వెర్షన్ అందుబాటులో లేకపోవటంతో గడచిన కొద్ది నెలలుగా ఈ మోడల్ అమ్మకాలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితులను పరిగణిలోకి తీసుకొని హ్యుందాయ్ తమ యాక్సెంట్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుంది.
అంటే, ఇకపై హ్యుందాయ్ యాక్సెంట్ భారత మార్కెట్లో కనిపించబోదన్నమాట. ఏదేమైనప్పటికీ భారత్‌లోని చెన్నై ప్లాంటులో యాక్సెంట్ ఉత్పత్తి మాత్రం కంపెనీ పూర్తిగా నిలిపివేయటం లేదు. ఎగుమతి మార్కెట్ల కోసం కంపెనీ ఈ మోడల్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కాగా.. హ్యుందాయ్ యాక్సెంట్ స్థానాన్ని భర్తీ చేస్తూ ఓ సరికొత్త కారు మార్కెట్లో విడుదల కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ ఐ10 ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ప్రస్తుతం కంపెనీ ఓ కారును అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. బిఏ కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ కారు ఇటు హ్యాచ్‌బ్యాక్, అటు కాంపాక్ట్ సెడాన్ రూపంలో లభ్యం కావచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో, త్వరలో రానున్న ఈ కాంపాక్ట్ యాక్సెంట్ స్థానాన్ని రీప్లేస్ చేయవచ్చని తెలుస్తోంది.



Click it and Unblock the Notifications








