డీజిల్ ఇంజన్లతో సమానంగా మైలేజీనిచ్చే పెట్రోల్ ఇంజన్స్
కొత్త తరం కార్లలో తయారీదారులు సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. ప్రత్యేకించి ఇంజన్ల తయారీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తాజాగా.. హ్యుందాయ్ ఓ అధునాతన పెట్రోల్ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తోంది. వాస్తవానికి ఇది పెట్రోల్‌ను ఇంధనంగా ఉపయోగించుకుంటున్నప్పటికీ, పనితీరులో మాత్రం డీజిల్ ఇంజన్ మాదిరిగా ఉంటుందట. గ్యాసోలైన్ డైరెక్ట్ కంప్రెషన్ ఇగ్నిషన్ (జిడిసిఐ) టెక్నాలజీతో కూడిన ఓ పెట్రోల్ ఇంజన్‌ను హ్యుందాయ్ అభివృద్ధి చేస్తోంది.
హ్యుందాయ్ అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త తరం 1.8 లీటర్ జిడిసిఐ పెట్రోల్ ఇంజన్ ఇదే సామర్థ్యంతో కూడిన ఇతర పెట్రోల్ ఇంజన్లతో పోల్చుకుంటే సుమారు 25 శాతం అధిక మైలేజీని ఆఫర్ చేయనుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరల మధ్య వ్యత్యాసం సుమారు రూ.20-25 మేర ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ మైలేజీనిచ్చే తక్కువ ధర కలిగిన పెట్రోల్ కార్లకు డిమాండ్ జోరుగానే ఉంటుంది. త్వరలోనే హ్యుందాయ్ ఈ తరహా వాహనాలను భారత్‌లో ఆఫర్ చేయనుంది.
భారత మార్కెట్లో కొనుగోలుదారులు ప్రత్యేకించి మైలేజ్‌కు మాత్రమే ప్రధాన్యత ఇస్తూ, ధర ఎక్కువైనా సరే డీజిల్ కార్లనే కొనుగోలు చేస్తున్నారు. ఈ ట్రెండ్‌ను మార్చేందుకు హ్యుందాయ్ తమ కొత్త జిడిసిఐ పెట్రోల్ ఇంజన్లను విడుదల చేయనుంది. ఈ ఇంజన్లతో కూడిన కార్ల ధరలు తక్కువగా ఉండటమే కాకుండా ఇవి మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తాయి. అంతేకాదు, వీటి మెయింటినెన్స్ ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది.

ఉదాహరణకు, ప్రస్తుతం 2.4 లీటర్ జిడిఐ ఇంజన్ కలిగిన హ్యుందాయ్ సొనాటా (పెట్రోల్) ధర రూ.18-20 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉంది. అదే ఈ కారులో కొత్త జిడిసిఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించినట్లయితే, హ్యుందాయ్ సుమారు రూ.15 లక్షలకే ఈ కారును ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది.
హ్యుందాయ్ జిడిసిఐ పెట్రోల్ ఇంజన్ ఎలా పనిచేస్తుంది?
ఈ కొత్త ఇంజన్ కంప్రెషన్ ఇగ్నిషన్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తుంది (డీజిల్ ఇంజన్ తరహాలో). ఈ రకమైన ఇగ్నిషన్ వలన సిలిండర్‌లోని పీడనమే ఇంధనాన్ని మండిస్తుంది (రెగ్యులర్ పెట్రోల్ ఇంజన్లలో స్పార్క్ ప్లగ్ ఇంధనాన్ని మండిస్తుంది). హ్యుందాయ్ జిడిసిఐ పెట్రోల్ ఇంజన్ స్పార్క్ ప్లగ్స్ లేకుండానే పనిచేస్తుంది. స్పార్క్ ప్లగ్‌కు బదులుగా ఇందులో సూపర్‌చార్జర్, టర్బోచార్జర్లను ఉపయోగిస్తారు. ఇందులో ఒక సిలిండర్‌కు ఒక ఎగ్జాస్ట్ వాల్వ్ కాకుండా రెండు కట్ అవుట్ ఎగ్జాస్ట్ వాల్వ్స్ ఉంటాయి. ఈ అదనపు విండో వలన ఇది సిలిండర్‌లోని పీడనంతో పాటుగా, వేడిని గ్రహించి పెట్రోల్‌ను మండిస్తుంది.
హ్యుందాయ్ జిడిసిఐ పెట్రోల్ ఇంజన్లు ఎప్పుడొస్తాయ్?
వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి ఇవి అందుబాటులోకి రావచ్చని అంచనా. హ్యుందాయ్ తొలుతగా ఈ ఇంజన్లను తమ సొనాటా కార్లలో ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది.


Click it and Unblock the Notifications








